గ్రేటర్ వైజాగ్ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నిక నేపథ్యంలో మంత్రి అవంతి శ్రీనివాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత నారా చంద్రబాబు నాయుడు పేపర్ టైగర్‌గా మారిపోయారన్నారు. రేపు జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక నేపథ్యంలో మంత్రి అవంతి ఈ రోజు కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. ఆయనతో పాటు ఎమ్మెల్యేలు ఈ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవంతి మాట్లాడుతూ..బలం లేకపోయినా టీడీపీ విశాఖ జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో పోటికి దిగిందని ఎద్దేవా చేశారు. ఏలూరు ఫలితాల్లో టీడీపీకి ప్రజలు బుద్ధి చెప్పినప్పటికీ ఆయన తీరు మారలేదని చెప్పారు. 

వైసీపీ కార్పొరేటర్లకు ఈ రోజు సాయంత్రం పార్టీ తరఫున విప్ జారీ చేస్తామని ప్రకటించారు. చంద్రబాబు నాయుడు వాస్తవ పరిస్థితులను చూసి అభివృద్ధికి సహకరించాలని కోరారు. స్టీల్ ప్లాంట్ విషయంలో టీడీపీ నాటకాలాడుతోందని ఆరోపించారు. రాజీనామా అంటూ డ్రామాలు చేస్తున్నారని, ఆచరణలో అలా చేయడం లేదని తెలిపారు. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ తరఫున పరిశీలకులుగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లను నియమించారు. ఎన్నికల్లో పదిమంది స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు వైసీపీ తరఫు వారు గెలుస్తారని మంత్రి అవంతి ధీమా వ్యక్తం చేశారు. కేవలం క్రాస్ ఓటింగ్‌ను ప్రోత్సహించిందుకే టీడీపీ పోటీలో దిగిందని, వైసీపీ విజయాన్ని చంద్రబాబు తారుమారు చేయలేరని పేర్కొన్నారు.

 బలం లేకపోయినా పోటీలో ఉండటం టీడీపీ నీచ సంస్కృతికి నిదర్శనమని అన్నారు. ప్రతిపక్ష నేత అభివృద్ధికి సహకరించాలని, ఆ సంస్కృతికి చంద్రబాబు అతీతంగా ఉన్నారని వైసీపీ నేతలు ఆరోపించారు. చంద్రబాబు ప్రతీ విషయంలో ప్రభుత్వానికి అడ్డు తగులుతున్నారని చెప్పారు. ఫిరాయింపులను టీడీపీ ప్రోత్సహించింది తప్ప వైసీపీ కాదన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలని కోరారు. టీడీపీ ప్రలోభాలకు కార్పొరేటర్లు లొంగరని తెలిపారు. ఏపీ అభివృద్ధిలో దూసుకుపోతున్నదని, వైసీపీ హయాంలోనే ప్రజలు చక్కగా జీవిస్తున్నారని చెప్పారు. ఈ మీటింగ్‌లో వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: