
సభలో హాజరైన జనసంద్రం ఊహలకు మించి ఉంది. అసలు కూటమి నేతలు 3.5 లక్షల మంది హాజరై ఉంటారని అంచనా వేయగా, వాస్తవానికి 5 లక్షల వరకు జనం తరలి వచ్చారని చెపుతున్నారు. ప్రత్యేకించి టీడీపీ కార్యకర్తల ఉత్సాహం అంచనాలకు మించి ఉండటంతో సభ స్థలం మారుమోగిపోయింది. పవన్ ప్రసంగం తక్కువసేపు మాత్రమే జరిగినా, ఆయన హాజరు జనంలో ఉత్తేజం నింపింది. చంద్రబాబు ప్రసంగం అయితే సభా వాతావరణాన్ని ఉర్రూతలూగించింది. సంక్షేమ పథకాలను వివరించినప్పుడు ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి. జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేసినప్పుడు కేకలు, ఈలలతో సభ మోతెక్కింది.
అనంతపురం వంటి రాయలసీమ మారుమూల జిల్లాలో ఇంత భారీ విజయోత్సవ సభను నిర్వహించడం కూటమికి పెద్ద సవాలే. అయితే ఎలాంటి అనుమానాలు లేకుండా ఈ సభ ఘనవిజయం సాధించడంతో కూటమి శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. ముఖ్యంగా, ఇటీవల కడప జిల్లాలో పులివెందుల సహా రెండు జడ్పీటీసీలను టీడీపీ గెలుచుకోవడం, రాయలసీమలో వైసీపీ బలాన్ని దెబ్బతీయడంలో ఇది కూటమిలో మరింత జోష్ నింపింది. ఇక అనంతపురం సభతో చంద్రబాబు వ్యూహం మరింత స్పష్టమైంది. రాయలసీమలో వైసీపీకి ఉన్న పట్టును క్రమంగా సడలిస్తూ, టీడీపీ ఆధిపత్యాన్ని చాటి చెప్పేలా ఈ సభతో అడుగులు మొదలయ్యాయి.