2023 ఎన్నిక‌ల్లో గెలుపు ల‌క్ష్యంగా క‌మ‌ల‌ద‌ళం వ్యూహాత్మ‌కంగా దూసుకొస్తోంది. అధికార టీఆర్ఎస్‌కు స‌మాంత‌ర పాల‌న అందించే దిశ‌గా అడుగులు వేస్తోంది. కేంద్రంలో తిరుగులేని శ‌క్తిగా ఉన్న బీజేపీ రాష్ట్రంలో నూత‌న గ‌వ‌ర్న‌ర్ సౌంద‌ర‌రాజ‌న్‌ను నియ‌మించ‌డంలో ఆంత‌ర్యం ఇదేన‌ని ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు.  కేంద్రం డైరెక్ష‌న్‌లోనే గ‌వ‌ర్న‌ర్ సౌంద‌రరాజ‌న్ క‌దులుతున్నార‌నే టాక్ ఇప్ప‌టికే మొద‌లైంది. ఇటీవ‌ల ఆమె తీసుకున్న ప‌లు నిర్ణ‌యాలు రాజ‌కీయ‌వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌కు దారితీస్తున్నాయి.


కేవ‌లం రాజ్‌భ‌వ‌న్‌కే ప‌రిమితం కాకుండా.. ప్ర‌జ‌ల‌తో నేరుగా మ‌మేకం అయ్యేందుకు ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. ఇందులో భాగంగానే ఆమె ప్ర‌జాద‌ర్బార్ నిర్వ‌హించాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చారు. కేంద్రంలో అధికారంలో ఉండ‌డం.. తెలంగాణ‌లో న‌లుగురు ఎంపీలు ఉండ‌డం.. అంత‌కుమించి.. రాష్ట్ర‌గ‌వ‌ర్న‌ర్‌గా సౌంద‌ర‌రాజ‌న్ ఉండ‌డంతో తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్‌కు స‌మాంత‌ర పాల‌న కొన‌సాగించాల‌ని ప‌ట్టుద‌ల‌తో బీజేపీ ఉంది. అందుకు త‌గ్గ‌ట్టుగా వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే.. గ‌వ‌ర్న‌ర్ సౌంద‌రరాజ‌న్ నేరుగా ప్ర‌జ‌ల‌ను క‌లిసి వారి క‌ష్టాల‌ను తెలుసుకుని, ప‌రిష్క‌రించేందుకు రెడీ అవుతున్నారు.


ఈ నిర్ణ‌యం వెనుక బీజేపీ భారీ స్కెచ్ ఉంద‌నే టాక్ వినిపిస్తోంది. రాష్ట్ర స‌చివాల‌యానికి రాకుండా.. కేవలంగా ప్ర‌గ‌తిభ‌వ‌న్‌కే ప‌రిమిత‌మైన ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను ఇరుకున పెట్టేందుకు క‌మ‌ల‌ద‌ళం ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క సామాన్యుడిని కూడా క‌ల‌వ‌లేదు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లోకి ఒక్కోసారి మంత్రుల‌కు కూడా అనుమ‌తి ఉండ‌ద‌నే టాక్ ఉంది.


ఈ నేప‌థ్యంలో గ‌వ‌ర్న‌ర్ సౌంద‌ర‌రాజ‌న్ ప్ర‌జాద‌ర్బార్‌నిర్వ‌హించి, సామాన్యుల క‌ష్టాల‌ను తెలుసుకుని, ప‌రిష్క‌రించాల‌ని నిర్ణ‌యించ‌డం గ‌మ‌నార్హం. ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌జ‌ల‌ను క‌ల‌వ‌ర‌నీ, కానీ.. గ‌వ‌ర్న‌ర్ మాత్రం సామాన్యుల‌ను కూడా నేరుగా క‌లుస్తూ వారి స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటున్నార‌నే టాక్‌ను ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకెళ్ల‌డ‌మే క‌మ‌ల‌ద‌ళం వ్యూహంగా క‌నిపిస్తోంది. అంతేగాకుండా.. ఇప్ప‌టికే రాష్ట్రంలో ప్ర‌బ‌లుతున్న విష‌జ్వ‌రాల‌పై నివేదిక ఇవ్వాల‌ని గ‌వ‌ర్న‌ర్ ఆదేశించారు.


అంతేగాకుండా ప‌లు కీల‌క శాఖల నివేదిక‌లు కూడా ఆమె కోరారు. దీంతో అధికార టీఆర్ఎస్‌కు స‌మాంత‌రంగా త‌న మార్క్ పాల‌న చూపించేందుకు గ‌వ‌ర్న‌ర్ సౌంద‌ర‌రాజ‌న్ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇటీవ‌ల స్వ‌యం స‌హాయ‌క సంఘాల స‌భ్యుల‌తో ఆమె స‌మావేశం కావ‌డం గ‌మ‌నార్హం. మొత్తంగా బీజేపీపై ప్ర‌జ‌ల్లో సానుకూల దృక్ప‌థం పెంచ‌డ‌మే ల‌క్ష్యంగా క‌మ‌ల‌ద‌ళం క‌దులుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: