ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థిరాస్తి రిజిస్ట్రేషన్లు బాగా  తగ్గాయి. 2018– 19 ప్రథమార్థంతో పోల్చితే ఈ ఏడాది ఇదే కాలంలో రిజిస్ట్రేషన్లు 4.21 శాతం తగ్గిపోయాయి. దేశవ్యాప్తంగా రియల్‌ ఎస్టేట్‌ రంగంలో స్తబ్దతే దీనికి కారణం అని నిపుణులు భావిస్తున్నారు . షేర్‌ మార్కెట్‌లో రియల్‌ ఎస్టేట్, ఆటోమొబైల్‌ రంగాలకు చెందిన షేర్లు కనిష్ట స్థాయికి పడిపోయాయి.


స్థిరాస్తి రంగంలో ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయనేందుకు రియల్‌ ఎస్టేట్‌ షేర్లు కనిష్ట స్థాయికి పడిపోవడమే నిదర్శనమని నిపుణులు చెబుతున్నారు. మన రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల ద్వారా ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో ఆదాయ ఆర్జన లక్ష్యం రూ.3,234 కోట్లు కాగా కేవలం  రూ. 2,467.67 కోట్లు (76.30 శాతం) మాత్రమే సమకూరాయి.రాష్టంలోని అన్ని జిల్లాలో  రియల్‌ ఎస్టేట్ వృద్ధి రేటు తిరోగమన దిశలో ఉండగా, వైఎస్సార్‌ జిల్లాలో మాత్రం గత ఏడాది మొదటి ఆరు నెలలతో పోల్చితే ఈ ఏడాది ఇదే కాలంలో రిజిస్ట్రేషన్ల సంఖ్య పది శాతానికి పైగా పెరిగింది.ప్రకాశం జిల్లాలో 1.72 శాతం, విజయనగరం జిల్లాలో 1.04 శాతం పెరిగాయి.


గుంటూరు జిల్లాలో రాజధాని పేరు చెప్పి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు స్థిరాస్తుల ధరలు భారీగా పెంచేశారని , గత పాలకులు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని , కృత్రిమ బూమ్‌ సృష్టించి ధరలు అమాంతం పెంచేశారని అనుకుంటున్నా నేపథ్యంలో ,  అంతకు ముందు సంవత్సరంతో పోల్చితే గుంటూరు జిల్లాలో స్థిరాస్తి విక్రయ లావాదేవీలు బాగా తగ్గాయి.


రాష్టంలో రియల్ ఎస్టేట్  పరిస్థితి ఇలా అవటానికి కారణం దేశమంతా నెల కొని ఉన్న ఆర్థిక మాంద్య ఫలితమే అంటున్నారు  నిపుణులు. రాష్ట్రంలో స్థిరాస్తి రిజిస్ట్రేషన్ల తో పాటు నిర్మాణాలు కూడా బాగా తగ్గాయి . ఇటువంటి పరిస్థితులలో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వృద్ధి కొరకు మరియు స్థిరాస్తి రిజిస్ట్రేషన్ల  పెరుగుదలకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: