కరోనా ఎలా వచ్చిందో సరిగ్గా ఎవరికి తెలియదు.. ఎందుకొచ్చిందో తెలుసుకునే లోపలే వేల ప్రాణాలను బలితీసుకుంది.. ఊపిరిని మెలిపెడుతూ, శ్వాసను బరువుగా, గుండెను భారంగా మార్చేస్తూ.. క్షణ క్షణం చావు భయాన్ని పరిచయం చేస్తుంది.. ఇప్పుడున్న సమయం చాలా విలువైందని అందరికి తెలుసు.. కానీ పేదవాడి కడుపు నిండేది ఎలా.. ఒక ఆజ్ఞ అందరిని ఉన్న చోటే బంధించింది.. ఈ లాక్‌డౌన్ అనే ఆజ్ఞ కొందరికి హనీమూన్‌లా మారితే.. మరి కొందరికి తమ కుటుంబంతో గడపడానికి అవకాశాన్ని ఇచ్చింది.. కానీ అనాధలకు, అభాగ్యులకు, పేదలకు మాత్రం కరోనా కాలకూట విషాన్నే చిమ్ముతుంది.. ఎందుకంటే వారికి కలిగే ఆకలికి తెలియదుకదా కరోనా వచ్చి తమ పొట్టలు కొడుతుందని..

 

 

ఈ సమయంలో మూడుపూటలా తినే వాడు నిజంగా అదృష్టవంతుడే.. ఒక్కపూట పిడికెడు ముద్ద.. చెంబెడు గంజినీళ్లూ దొరకని వారు కూడా ఉన్నారు.. మరి వారంత దురదృష్టవంతులు ఎవరున్నారు ఈ లోకంలో.. ఎప్పుడెప్పుడు లాక్‌డౌన్ ముగిసిపోతుందా.. కడుపునిండా తిండి ఎప్పుడు దొరుకుతుందా అని కళ్లలో వత్తులు వేసుకుని ఆశగా ప్రాణాలను నిలుపుకుంటున్న వారికి కాలమే సమాధానంగా మారుతుంది కావచ్చూ.. అయితే, పేదలను ఆదుకోడానికి ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నిస్తున్నా.. చాలామందికి అవి చేరడంలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి..

 

 

ఇకపోతే నిజమైన పేదవాడికి రుచి, శుచితో పనిలేదని నిరూపించే సంఘటన ఒకటి తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. ఈ వీడియోను చూస్తే ఎంతటివారికైనా గుండె బరువెక్కుతుంది. తెలియక కంటి నుండి కన్నీరు వస్తుంది.. సామాన్యంగా మనం తినే ఆహారంలో గానీ, తాగే పదార్ధాల్లో గాని చిన్న నలక వచ్చినా.. తినే ఆహారం రుచిగా లేకపోయినా బయటపడవేయడానికి కూడా ఆలోచించం.. ఏదైన ఫంక్షన్లు జరిగితే అందులో తినే వారికంటే వృధాచేసే వారే ఎక్కువ ఉంటారు.. మరి అలాంటి సమాజంలో ఓ పేదవాడు తన జానెడు పొట్టకోసం పడుతున్న ఈ తపన చూస్తే.. మనుషులుగా పుట్టినందుకు సిగ్గుపడాలో లేదో తెలియని సందిగ్ధం నెలకొంటుంది..

 

 

ఇకపోతే రోడ్డుపై ఒలికిన పాలను కుక్కలు తాగుతుంటే.. మరో వైపు ఓ వ్యక్తి ఆ పాలను తన దోసిళ్లతో పట్టుకుని ముంతలో పోస్తున్నాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని ఆగ్రాకు ఆరు కిలోమీటర్ల దూరంలో ఏప్రిల్ 13న చోటుచేసుకుంది. ఈ ప్రాంతంలో ఓ పాల వ్యాను బోల్తాపడటంతో అందులో ఉన్న పాలన్నీ రోడ్డుపాలయ్యాయి. దీంతో ఓ వ్యక్తి ముంత పట్టుకుని వచ్చి ఆ పాలను సేకరించేందుకు ప్రయత్నిస్తున్నాడు.. ఇక ఈ దృశ్యాన్ని కమల్ ఖాన్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో క్షణాల్లో వైరల్‌‌గా మారింది. పేదలకోసమే ఈ పధకాలు అని చెప్పుకునే ప్రభుత్వం ఇలాంటి నిజమైనా అభాగ్యులను గుర్తించి సాయం అందిస్తే కనీసం వారు ఒక్కపూట అయినా కడుపునిండా తినగలరు.. చెప్పుకోవడానికి ఏముంది.. ఇతనికి వచ్చిన పరిస్దితే ప్రతి వారికి ఎప్పుడో ఒకప్పుడు ఎదురవ వచ్చూ..  

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: