క‌రోనా వైర‌స్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. అన్ని దేశాల్లోనూ దాని విధ్వంసం కొన‌సాగుతోంది. దీని నివార‌ణ‌కు ఎలాంటి మందులేక‌పోవ‌డంతో అనేక దేశాల్లో లాక్‌డౌన్ కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. మ‌రోవైపు దీనికి విరుగుడు క‌నిపెట్టే ప‌నిలోనూ అన్నిదేశాలూ నిమ‌గ్న‌మ‌య్యాయి. శాస్త్ర‌వేత్త‌లు అహ‌ర్నిశ‌లు శ్ర‌మిస్తున్నారు. వ్యాక్సిన్ కనిపెట్టేందుకు ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు చేస్తున్నారు. మన దేశంలోనూ క‌రోనాకు విరుగుడు క‌నిపెట్టే ప్ర‌య‌త్నాలు జోరుగానే సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మ‌న ప్రాచీన వైద్యం ఆయుర్వేదం వైపు కూడా ప‌రిశోధ‌న‌లు సాగుతున్నాయి. ఈ క్ర‌మంలోనే ఆయుర్వేద మూలిక అశ్వగంధపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు భారత్ సిద్ధమవుతోంది. అయితే..ఇప్ప‌టికే మలేరియా నివార‌ణ మందు హైడ్రాక్సీ క్లోరోక్విన్ వాడుతున్న విష‌యం తెలిసిందే. దీనితో పోల్చితే అశ్వ‌గంధ మూలిక ఎంత‌మేర‌కు సమర్థవంతంగా పని చేస్తుందో తెలుసుకోనుంది.

 

ఐసీఎంఆర్, సీఎస్ఐఆర్ సాంకేతిక సిబ్బంది సాయంతో ఆయుష్, వైద్య, శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖలు ఉమ్మడిగా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. మరోవైపు..ఆయుష్ కార్యదర్శి రాజేశ్ కొటెచా మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను వెల్ల‌డించారు. కరోనా లక్షణాలు స్వల్పంగా, కాస్త ఎక్కువగా ఉన్న రోగులకు అశ్వగంధతో పాటు యష్టిమధు, గుడూచి, పిప్పలి, పాలా హెర్బల్ ఫార్మలేషన్ (ఆయుష్64) ఇస్తారని ఆయ‌న‌ చెప్పారు. ఊపిరితిత్తులు, శ్వాస సమస్యలు రాకుండా… వస్తే వాటిని నివారించేందుకు ఈ క్లినికల్ ట్రయల్స్ ఉపయోగపడతాయని తెలిపారు. ఆయుష్64ని ఇప్ప‌టికే మలేరియా నివారణకు వాడుతున్న విష‌యం తెలిసిందే. ఈ ప్ర‌య‌త్నాలు ఏమేర‌కు ఫ‌లిస్తాయో చూడాలి మ‌రి. 

మరింత సమాచారం తెలుసుకోండి: