ప్ర‌ముఖ న‌టుడు సోనూసూద్ నివాసంలో ఆదాయ‌పు పన్నుశాఖ అధికారులు సోదాలు నిర్వ‌హిస్తున్నారు. బుధ‌వారం ప్రారంభ‌మైన సోదాలు ఈరోజు కూడా జ‌రుగుతుండ‌టం గ‌మ‌నార్హం. ముంబ‌యితోపాటు నాగ‌పూర్‌, జైపూర్‌లోని కార్యాల‌యాల్లో ఏక‌కాలంలో ఈ సోదాలు జ‌రుగుతున్నాయి. ల‌క్నోకు చెందిన ఒక స్తిరాస్థి సంస్థ‌తో సోనూసూద్ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనికి సంబంధించిన ఆదాయాన్ని ప‌న్ను రూపంలో చెల్లించ‌లేద‌ని ఐటీ ఆరోప‌ణ‌. వివ‌రాల‌న్నింటినీ సేక‌రిస్తున్న అధికారులు స్తిరాస్థి సంస్థ‌తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ప్ర‌శ్నిస్తున్నారు. సూద్ ఛారిటీ ఫౌండేష‌న్ బ్యాంకు ఖాతాల‌ను కూడా ప‌రిశీలిస్తున్న అధికారులు ఈరోజు సాయంత్రం మీడియా స‌మావేశం నిర్వ‌హించే అవ‌కాశం క‌న‌ప‌డుతోంది. ఢిల్లీలోని ఆప్ ప్ర‌భుత్వం ప్రారంభించిన ఓ కార్య‌క్ర‌మానికి బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా సోనూ నియ‌మితుల‌య్యారు. అప్ప‌టినుంచి ఆదాయ‌పుప‌న్నుశాఖ క‌న్ను సూద్‌పై ప‌డింది. కొవిడ్‌వేళ ఎంతోమంది కార్మికులు, వ‌ల‌స కూలీల‌కు సాయం చేసిన వ్య‌క్తిపై రాజ‌కీయంగా క‌క్ష‌సాధింపు చ‌ర్య‌లు స‌రికాద‌ని నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: