కోడెల శివప్రసాద్ సంతాప సభలో అయ్యన్న పాత్రుడు పోలీస్ అధికారులపై మాట్లాడిన మాటల‌ను ఏపీ పోలీస్ అధికారు సంఘం అధ్య‌క్షుడు జ‌నుకుల శ్రీ‌నివాస్‌రావు ఖండించారు. విజ‌య‌వాడ‌లో ఇత‌ర స‌భ్యుల‌తో క‌లిసి ఆయ‌న మీడియాతో మాట్లాడారు. గతంలో గౌరవప్రదమైన పదవుల్లో ఉన్న అయ్య‌న్న పోలీస్ వ్యవస్థను కించపరిచేలా మాట్లాడార‌ని, భవిష్యత్తులో ఆయ‌న‌కు అలాంటి పదవులు ఇవ్వకూడదని కోరుతున్నామ‌న్నారు. రాయ‌డానికి వీల్లేని ప‌దాల‌ను వాడార‌ని, మేము మా భాషలో మాట్లాడితే మీరు తట్టుకోలేరంటూ అయ్య‌న్న‌ను హెచ్చ‌రించారు. పోలీస్ వ్యవస్థ ఎంత కఠినతరమైనదో మీకు తెలుస‌ని, అన్యాయం జరిగితే న్యాయస్థానాలు ఆశ్రయించాల‌ని, రాజ్యాంగ ప‌ర‌మైన హక్కులు మాకు లేవా? ఉన్న‌ది మీకేనా అంటూ ప్ర‌శ్నించారు. సామాన్య ప్రజలను తిట్టినట్టు ఐపీఎస్ అధికారులను తిట్టడం సరికాద‌ని ఉపాధ్య‌క్షురాలు నాగిని అన్నారు. ఉన్నత చదువులు చదువుకున్నవారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, కింది స్థాయి వాళ్ళని ఇంకెలా మాట్లాడతారో అన్నారు. ఇలాంటి వారిని కట్టడి చేయాల్సిన బాధ్యత చంద్రబాబు పై ఉంద‌న్నారు. చంద్రబాబు ఏ రోజు పోలీస్ లను ఒక మాట కూడా అనలేద‌ని, అయ్యన్న పాత్రుడు మాట్లాడిన మాటలు అభ్యంతరకరంగా ఉన్నాయ‌న్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: