మా అసోసియేషన్ కు సంబంధించి రోజు రోజుకూ పెరిగిన వివాదాల కారణంగా ఇప్పటి ఎన్నికలు మరింత ప్రతిష్టాత్మకంగా మారాయి అన్నది ఓ వాదన. ఈ నేపథ్యంలో సీనియర్, జూనియర్ నటులు తమ బాధ చెప్పుకోలేక అవస్థ పడుతున్నారు. కానీ ఎన్నికల తరువాత కూడా ఇటువంటి వాతావరణం కొనసాగుతుందేమోనన్న భయాలూ ఉన్నాయి కొందరిలో! ఈ సందర్భంలోనే నటుడు, దర్శకుడు,
నిర్మాత ఆర్. నారాయణ మూర్తి స్పందించి, నాలుగు మంచి మాటలు చెప్పి వెళ్లారు.. అవేంటంటే..
మా ఎన్నికల సందర్భంగా రోడ్డు మీదకు వచ్చి కొట్టుకోవడం తగదని పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి అన్నారు. తీయాల్సింది పాన్ ఇండియా సినిమాలు కాదని, దక్కాల్సింది స్థానిక కళాకారులకు ప్రోత్సాహం అని హితవు చెప్పి ఓటేసి ప్రజా స్వామ్య స్ఫూర్తిని చాటారు. అదేవిధంగా రాజకీయాలు రావడంతోనే మా పరువు బజారున పడిందన్నది ఆయన ఆవేదన. జాతీయ స్థాయిలో సినిమాలు తీయడం సంతోషమేనని, అదే స్థాయిలో పేద కళాకారులకు అండగా ఉండాల్సిన బాధ్యత కూడా మా అసోసియేషన్ కు ఉందని అన్నారు. మరోవైపు అఖిల్ కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చాడు. అదేవిధంగా ఓటేసిన వారిలో సీనియర్ నటులు మురళీ మోహన్, జయప్రద, గిరిబాబు, శివాజీ కూడా ఉన్నారు.