నందమూరి అగ్ర హీరో, యంగ్ టైగ‌ర్‌ జూనియర్  ఎన్టీఆర్ పై టీడీపీ నేత వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు చేసారు. వైసీపీ నేతలు  చంద్రబాబు కుటుంబానికి  క్షమాపణ చెప్పాలని విజయవాడలో వర్ల రామయ్య దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా  రామ‌య్య మాట్లాడారు.  నారా భువనేశ్వరిపై కొడాలి నాని, వల్లభనేని వంశీ విమర్శలు చేస్తే జూనియ‌ర్ ఎన్టీఆర్‌ స్పందించిన తీరు సరిగా లేదని అభిప్రాయపడ్డారు వర్ల రామయ్య.

చంద్ర‌బాబునాయుడు స‌తీమ‌ణి భువనేశ్వరి మేనల్లుడిగా ఎన్టీఆర్‌ విఫలం అయ్యారని విమర్శించారు. మేనత్తను నోటికొచ్చినట్టు పేర్కొన్నా.. మేనల్లుడిగా ఆయన సరిగ్గా స్పందించలేదని రాష్ట్రం మొత్తం అనుకుంటోందని  రామయ్య పేర్కొన్నారు. సినిమాల కోసం కుటుంబాన్ని, నైతిక విలువలను వదులుకుంటారా.. అని ఎన్టీఆర్‌ను  నిలదీశారు. వైసీపీ నేతలపై జూనియర్ ఎన్టీఆర్‌ స్పందించిన తీరును తప్పు బడుతూ.. నందమూరి హరికృష్ణ గురించి రామ‌య్య‌ ప్రస్తావించారు. మీ నాన్న సీత‌య్య బతికుంటే ఇంకో రకంగా ఉండేద‌ని, నేరుగా హ‌రికృష్ణ రంగంలోకి దిగేవాడని, రచ్చ రచ్చ చేసుండేవాడని  అలా మీరు ఎందుకు చేయలేకపోయారు అని ప్ర‌శ్నించారు.చంద్రబాబు కుటుంబాన్ని అవమానించినందుకు ఇవాళ‌ వర్ల రామయ్య తన సతీమణితో కలసి 12 గంటల దీక్షకు దిగారు.


మరింత సమాచారం తెలుసుకోండి: