దేశంలో మ‌ళ్లీ లాక్‌డౌన్ అనేప‌దం త‌రుచూ విన‌బ‌డుతున్న విష‌యం తెలిసిందే. అయితే లాక్‌డౌన్ అమ‌ల్లోకి తేవ‌డానికి కేంద్రం మాత్రం సుముఖంగా లేదు. అయితే రాష్ట్రాల‌కు ఆంక్ష‌లు విధించుకోవ‌డానికి స్వేచ్ఛ‌ను ఇవ్వ‌డంతో త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం లాక్‌డౌన్‌ను ప్ర‌క‌టించింది. ఈనెల 19 నుంచి30వ తేదీ వ‌ర‌కు చెన్నై ప‌ట్ట‌ణంలో లాక్‌డౌన్‌ను అమ‌లు చేస్తున్న‌ట్లు తెలిపింది. గ‌త కొద్ది రోజులుగా త‌మిళ‌నాడులో పాజిటివ్ కేసుల సంఖ్య గ‌ణ‌నీయంగా పెరుగుతూ పోతోంది. మ‌ర‌ణాల సంఖ్య కూడా పెరిగింది. ముఖ్యంగా చెన్నై ప‌ట్ట‌ణంలో, దాని చుట్టు ఉన్న ప‌రిస‌ర ప్రాంతాల్లోనూ కేసుల సంఖ్య భారీగా న‌మోద‌వుతూ వ‌స్తోంది.

 

రాష్ట్రంలో ఎక్కువ‌గా కేసులు న‌మోదవుతున్న ప్రాంతాల్లో లాక్‌డౌన్ అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించిన తమిళనాడు ప్ర‌భుత్వం ఈ మేర‌క ఉత్త‌ర్వులు జారీ చేసింది.  నాలుగు జిల్లాల్లో మళ్లీ లాక్‌డౌన్‌ విధించాలని ముఖ్యమంత్రి పళనిస్వామి నిర్ణయం తీసుకున్నారు. గ్రేటర్‌ చెన్నై, చెంగల్పట్టు, తిరువల్లూర్, కాంచీపురం జిల్లాల్లో జూన్‌ 19 నుంచి 30వ తేదీ వరకూ లాక్‌డౌన్‌ అమల్లో ఉంటుంది. ప్ర‌భుత్వం పేర్కొన్న ప్రాంతాల్లో 12 రోజుల పాటు లాక్‌డౌన్ అమ‌ల్లో ఉంటుంది. ఈ  12 రోజుల్లో రెండు ఆదివారాలు రానున్నాయి. ఆ రెండు రోజులు పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌ అమలు చేస్తారు. ఆటోలు, ట్యాక్సీలు, ప్రైవేట్‌ వాహనాలను అనుమతించరు.

 

 ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే నిత్యావసరాల కొనుగోలుకు అవకాశం క‌ల్పిస్తారు. చెన్నై నుంచి ఎవరైనా బయటకు వెళ్లాలనుకుంటే అత్య‌వ‌స‌ర‌మైతేనే  వెళ్లాల్సి ఉంటుంది. అది కూడా ప్రభుత్వం నుంచి ఈ–పాస్‌ తీసుకోవాలి. ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టి వ‌ర‌కు ప్రపంచ వ్యాప్తంగా 81.07 లక్షలకు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు న‌మోద‌య్యాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనాతో 4.38 లక్షల మంది మృతి చెందారు.  ప్రపంచవ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్న 41.87 లక్షల మంది
ఇంటికి చేరుకున్నారు. భారత్‌లో మొత్తం 3లక్షల 32వేల 424 పాజిటివ్‌ కేసులు న‌మోద‌య్యాయి.  ఇప్పటివరకు 1,69,798 మంది డిశ్చార్జ్ కాగా , 9,520 మంది మృతి చెందారు.  దేశంలో ప్రస్తుతం 1,53,106 యాక్టివ్‌ కేసులు ఉన్న‌ట్లు కేంద్ర వైద్య ఆరోగ్య‌శాఖ ప్ర‌క‌టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: