లంగ్ కేన్సర్ ఓ సైలెంట్ కిల్లర్, వ్యాధి ముదిరేంత వరకూ ఎలాంటి లక్షణాలు కనిపించవు. ముదిరిన తర్వాత గుర్తించినా చికిత్సకు లొంగదు. అయితే ఊపిరితిత్తుల కేన్సర్ గురించి అవగాహన కల్పించడం కోసం ఏటా ఆగష్టు 1న వరల్డ్ లంగ్ కేన్సర్ డే నిర్వహిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ వ్యాధి కారణంగా ఏటా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. 90 శాతం లంగ్ కేన్సర్ కేసులు స్మోకింగ్‌తో సంబంధం ఉన్నవే.


సిగరెట్లు కాల్చడం, హుక్కా, గంజాయి పీల్చడం లాంటి అలవాట్ల కారణంగా లంగ్ కేన్సర్ బారిన పడే ముప్పు అధికం. కేవలం పొగ పీల్చే వారే కాదు, పొగతాగే అలవాటు లేనివారు కూడా ఈ వ్యాధి బారిన పడతారు. అయితే  పీచుతో కూడిన ఆహార పదార్థాలు, పెరుగును ఎక్కువగా తినేవారికి ఊపిరితిత్తుల కేన్సర్‌ ముప్పు అతి తక్కువని అమెరికాలోని వేండర్‌బిల్ట్‌ -ఇన్‌గ్రామ్‌ కేన్సర్‌ కేంద్రం శాస్త్రవేత్తలు వెల్లడించారు. 


పరిశోధనలో భాగంగా వివిధ దేశాలకు చెందిన 14 లక్షల మందిని శాస్త్రవేత్తలు ఐదు గ్రూపులుగా విభజించారు. వీరిలో ఆహారంలో పీచు పదార్థాలు, పెరుగు తీసుకునే వారిలో ఊపిరితిత్తుల కేన్సర్ రిస్క్ 33 శాతం తక్కువగా ఉన్నట్టు గుర్తించారు. వీటిలోని పోషక విలువలు జీర్ణాశయంలోని పేగుల్లో ఉండే గట్‌ బ్యాక్టీరియా సామర్థ్యాన్ని పెంచి కేన్సర్ రాకుండా అడ్డుకుంటాయని అధ్యయనంలో వెల్లడైనట్టు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: