ఏపీ రాజకీయాల్లో మరో సంచలనం చోటు చేసుకుంది. తరచూ వివాదాల్లో ఉండే ఎంపీ రఘురామ కృష్ణంరాజు పై సీబీఐ చార్జిషీటు దాఖాలు చేసింది. ఎంపీ రఘురామకృష్ణంరాజు సహా 16 మందిపై సీబీఐ చార్జిషీట్‌ దాఖలైంది. ఆర్థిక సంస్థలు, బ్యాంకులను మోసం చేసిన కేసులో ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు ఈ షాక్ తగిలింది. అసలు కథేమింటంటే.. తమిళనాడులోని ట్యూటీకొరిన్‌లో థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తామని ఇండ్‌ భారత్‌ థర్మల్‌ పవర్‌ మద్రాస్‌ లిమిటెడ్‌ అనే కంపెనీ అనేక
ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంది.


ఆ తర్వాత ఆ రుణాలు ఎగవేసింది. దీనిపై 2019 ఏప్రిల్‌ 29న సీబీఐ కేసు నమోదు చేసింది. ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఈ సంస్థకు ఛైర్మన్ అండ్ ఎండీ. రూ.947.71 కోట్ల మేరకు మోసం చేసినందుకు ఇండ్‌ భారత్‌ కంపెనీ చైర్మన్, ఎండీ రఘురామ కృష్ణంరాజుతో పాటు ఆ కంపెనీ డైరెక్టర్లు, అనుబంధ కంపెనీలు, చార్టెడ్‌ అకౌంటెంట్లు, కాంట్రాక్టర్లపైనా చార్జిషీటు దాఖలుచేశారు. మొత్తం  మొత్తం 16 మందిపై న్యూ ఢిల్లీలోని సీబీఐ కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేశారు.


ఈ కేసులో రఘురామ చుట్టూ బాగానే బిగిసినట్టుంది. థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటు పేరిట ఆర్థిక సంస్థలను  ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఎలా మోసం చేశారనేది సీబీఐ వివరంగా తెలిపింది. ఇండ్‌ భారత్‌ పవర్‌ కంపెనీ చైర్మన్, ఎండీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు పక్కా పన్నాగంతోనే బ్యాంకులను మోసం చేశారని తెలిపింది. థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తామని చెప్పి ఆర్థిక సంస్థలనుంచి ఏకంగా రూ.947 కోట్లు రుణం తీసుకున్నారట.

 

రఘురామ కృష్ణంరాజు పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌, రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌, ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ ఫైనాన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ వంటి ప్రభుత్వ సంస్థలతో కూడిన కన్సార్షియం నుంచి రుణం తీసుకున్నారు. రుణం తీసుకున్నారు కానీ.. థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ మాత్రం ఏర్పాటు చేయలేదు. అంతే కాదు.. రుణం తీసుకున్న సొమ్ములను నిబంధనలకు విరుద్ధంగా ఇతర రంగాలకు దారి మళ్లించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: