పర్యావరణ పరిరక్షణ గురించి ఇంత వరకూ మాట్లాడింది చాలు... ఇక చేతల్లో చూపాలన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఐక్యరాజ్య సమితి క్లైమాట్‌ యాక్షన్‌ సమ్మిట్ లో ఈ వ్యాఖ్యలు చేశారు భారత్‌ ప్రధాని. అలాగే విపత్తుల నిర్వహణకు మౌలిక వసతులు కల్పనలో భారత్‌ భాగమౌతుందన్నారు మోడీ. 


టన్నుడు ఉపన్యాసం కంటే... ఔన్సుడు అంకిత భావం గొప్పది. ఇదీ ప్రపంచానికి భారత్‌ ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు. వాతావరణ మార్పులపై ఐక్యరాజ్య సమితి నిర్వహించిన శిఖరాగ్ర సదస్సులో పర్యావరణ పరిక్షణకు భారత్‌ తీసుకుంటున్న చర్యల్ని వివరించారు ప్రధాని నరేంద్ర మోడీ. చర్చలకు కాలం చెల్లిందనీ.. ఇక ఆచరణలో చూపించాల్సిన సమయం వచ్చిందన్నారు మోడీ. భారత్ ఇప్పటికే ఆ దిశగా చర్యలు ప్రారంభించినట్టు చెప్పారు. భారత్‌లో  లక్షలాది కుటుంబాలకు వంట గ్యాస్ అందిస్తున్నామని తెలిపారు మోడీ. తద్వారా మహిళలు పొగబారిన పడకుండా కాపాడామన్నారు. 


ఈ ఏడాది స్వతంత్ర దినోత్సవం సందర్భంగా... సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నుంచి స్వేచ్ఛ పొందాలని ఒక ప్రజా ఉద్యమానికి పిలుపునిచ్చామన్నారు మోడీ. ప్రపంచ స్థాయిలో సింగిల్ యూజ్ వాడకం ప్లాస్టిక్‌ వాడకానికి వ్యతిరేకంగా అవగాహన పెంచుతుందని తాము ఆశిస్తున్నట్టు తెలిపారు. అంతర్జాతీయ సోలార్‌ కార్యక్రమంలో భారత్‌ క్రియాశీలకంగా వ్యవహరిస్తోందని చెప్పారు మోడీ. ఎలక్ట్రిక్‌, బయో ఫ్యూయల్‌ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నామని వివరించారు. వాతావరణంలో వస్తున్న అనూహ్య మార్పుల వల్ల వస్తున్న ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోడానికి సిద్ధం కావాలన్నారు భారత్‌ ప్రధాని. విపత్తుల నిర్వహణ కోసం మౌలిక వసతుల కల్పనకు భారత్‌ ప్రపంచ దేశాలతో కలిసి పని చేస్తుంద్నారు మోడీ.


ఐక్యరాజ్య సమితి శిఖరాగ్ర సదస్సుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హాజరై అందర్నీ ఆశ్చర్యపర్చారు. వివిధ దేశాల ప్రతినిధుల మధ్యలో దాదాపు 15 నిమిషాల పాటు కూర్చొని... ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగాన్ని విన్నారు ట్రంప్‌. భారత్‌ చేపడుతున్న చర్యల గురించి మోడీ వివరిస్తుంటే.. చప్పట్లు కొడుతూ అభినందించారు ట్రంప్‌. తర్వాత ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు.    
అమెరికాలోని న్యూయార్క్‌లో జరిగిన క్లైమాట్‌ యాక్షన్‌ సమ్మిట్ లో మొత్తం 63 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. 2015 ప్యారిస్‌ ఒప్పందానికి అనుగుణంగా అన్ని దేశాలు క్లైమాట్‌ యాక్షన్‌ ప్లాన్‌ను అమలు చేయాలన్నదే లక్ష్యంగా ఈ శిఖరాగ్ర సదస్సు జరుగుతోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: