చైనా.. అసాధ్యాన్ని సుసాధ్యం చేసే దేశం. వేగంగా నిర్మాణాలు పూర్తి చేయాలన్నా.. జెట్ స్పీడ్ తో వ్యవహరించాలన్నా.. డ్రాగన్ కంట్రీకి మరొకరు సాటిరారు. అయితే అలాంటి దేశాన్నే కరోనా గడగడలాడించింది. కరోనాను కంట్రోల్ చేయడం  డ్రాగన్ దేశం వల్లకాలేదు. మరి అలాంటి చైనాకు సాధ్యం కానిది.. కేరళకు ఎలా సాధ్యమైంది. ఇంతకీ మళయాళీలు.. దీన్ని ఎలా సాధించగలిగారు ?

 

కరోనా వైరస్.. ఇది కొత్తదేమి కాదు. గతంలో సార్స్, మెర్స్ లాంటిదే. జంతువుల నుంచి మనుషులకు సోకిన వైరస్. ఇంతవరకూ మానవాళి.. ఇలాంటి వైరస్ లను ఎదుర్కోలేదు కాబట్టి.. చైనాలో ఇది తొలిసారి వచ్చినప్పుడు.. గుర్తించడానికే చాలా సమయం పట్టింది. పైగా ఇది మనుషుల శరీరంలో ఎంటరైన వెంటనే పెద్దగా ప్రభావం చూపదు. దాదాపు 4 నుంచి 14 రోజుల వరకు సమయం పడుతుంది. ఇంతలో ఒకరి నుంచి మరొకరికి.. ఇతర ఫ్లూ-లాగే వ్యాపించింది. చైనాలో పెద్ద నగరమైన వుహాన్ లో ఇది ప్రబలగానే.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇతర దేశాలను అప్రమత్తం చేసింది. ఇప్పటివరకు WHO.. అలర్ట్ చేసిన ఐదో వ్యాధి ఇది. ఇంతకముందు 2009లో స్వైన్ ఫ్లూ, 2014లో పోలియో, అదే ఏడాది ఎబోలా, 2016లో జికా వైరస్ లను ప్రపంచ ఆరోగ్య సంస్థ.. ఇలా ప్రకటించింది. WHO ప్రకటించగానే.. కేరళ సర్కార్ కూడా అప్రమత్తమైంది. ఎందుకంటే వైద్య రంగంలో ఇతర దేశాల్లో పనిచేసే భారతీయుల్లో కేరళవాసులే ఎక్కువ. దాంతో ప్రమాదాన్ని ముందే ఊహించిన కేరళ.. ఐదు సూత్రాల ప్రణాళికను అమలు చేసింది. ఇంతకీ ఏంటా ఐదు సూత్రాల ప్లాన్ ?

 

కేరళ సర్కార్ పాటించిన ఐదు సూత్రాల్లో మొదటిది.. అనుమానితుల్ని గుర్తించడం ! గత ఏడాది నిఫా లాంటి ఉపద్రవాన్ని ఎదుర్కొన్న అనుభవంతో.. కేరళ సర్కార్ ముందుచూపుతో వ్యవహరించింది. ఏకంగా కరోనా అనుమానితుల కోసం ఆసుపత్రుల్లో  మాక్ డ్రిల్స్ కూడా నిర్వహించింది. పైగా కేరళలో ప్రజా ఆరోగ్య వ్యవస్థ కూడా పక్కాగా ఉంటుంది. ప్రతి 4 కిలోమీటర్లకు ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంటుంది. పైగా ప్రైవేటు వైద్యులతో సమానంగా జీతాలు ఇవ్వడం వల్ల.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అనుభవజ్ఞులైన వైద్యులు కూడా అందుబాటులో ఉంటారు. ఈ వ్యవస్థకు తోడు కరోనా లాంటి వాటిని ఎదుర్కోవాలంటే.. ఐసోలేటెడ్ వార్డులు ఉండాలి. అందుకోసం కేరళ సర్కార్ చర్యలు తీసుకుంది. ప్రస్తుతం ఉన్న ఆసుపత్రుల్లో.. ఎందులోనైతే 40 బెడ్స్ వరకు ఐసోలేటెడ్ వార్డ్స్ గా మార్చవచ్చో గుర్తించారు. వాటిని వెంటనే కరోనా ట్రీట్ మెంట్ వార్డులుగా మార్చేశారు. 

 

ఇక రెండో సూత్రంలో భాగంగా.. వైరస్ వ్యాప్తి చెందకుండా నివారణ చర్యలు తీసుకున్నారు. వ్యాక్సిన్, చికిత్స లేని కరోనా లాంటి వ్యాధి.. మరింత విజృంభించకుండా ఉండాలంటే.. దాని వ్యాప్తిని అడ్డుకోవడమే ఏకైక మార్గం. ఇందుకోసం కేరళ సర్కార్ పకడ్బందీ చర్యలు తీసుకుంది. కరోనా అనుమానితులు.., వాళ్ల కుటుంబసభ్యులు, సన్నిహితుల సమాచారాన్ని సేకరించింది. వాళ్లందరికీ పరీక్షలు చేయించింది. అనుమానిత కేసుల్లో రోగులను.. ప్రత్యేక వార్డులకు తరలించి ఐసోలేటెడ్ వార్డుల్లో చికిత్స అందించారు. మరికొందరిని దాదాపు గృహనిర్బంధంలో ఉంచి.. చికిత్స అందించేవారు. ఇక కరోనా ప్రభావిత  దేశాల నుంచి వచ్చిన వారిని ప్రత్యేకంగా స్క్రీనింగ్ చేసి.. నిపుణుల వద్ద కౌన్సిలింగ్ ఇప్పించారు.

 

ఇక మూడో స్టెప్ లో భాగంగా నిరంతర పర్యవేక్షణ అనేది కొనసాగించింది. ఇందుకోసం ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసింది కేరళ ప్రభుత్వం. వివిధ శాఖల్లో నిపుణులతో 18 బృందాలను ఏర్పాటు చేసి.. రాష్ట్రంలో ఎదురువుతున్న పరిస్థితిని పర్యవేక్షించింది. ప్రతిరోజు ఈ నిపుణుల బృందం సమావేశమై.. ఇవాళ పరిస్థితి ఏంటి ? రేపు ఎలాంటి చర్యలు తీసుకోవాలి ? అనే అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునేవారు. ఇక గ్రామస్థాయిలో ఆరోగ్య సిబ్బంది, పంచాయతీ ప్రెసిడెంట్.. పరిస్థితిని సమీక్షించేవారు. 

 

ఇక నాలుగో సూత్రంలో భాగంగా.. ప్రజల్లో ఉన్న ఆందోళనను.. అప్రమత్తతగా మార్చగలిగారు. ఒక వైరస్ ప్రమాదకరంగా ఉందంటేనే..  దానిపై ప్రజల్లో ఆందోళన మొదలవుతుంది. అప్పుడు వైద్యులకు, ప్రభుత్వానికి కూడా ఇబ్బందే. ప్రజలు సమన్వయంతో ప్రభుత్వానికి సహకరించినప్పుడే.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవచ్చు. అందుకే, కరోనాకు సంబంధించి భయాలను, అపోహలను తొలగించడానికి కేరళ సర్కార్ చర్యలు తీసుకుంది. ఇందుకోసం కాల్ సెంటర్స్ ను ప్రారంభించారు. వీటిలో ప్రజలకు వస్తున్న డౌట్స్ ను నిపుణులు తీర్చేవారు. జిల్లాస్థాయిలో వైద్య సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి కరోనాపై అవగాహన కల్పించారు. దానివల్ల ఏదైనా ప్రాంతంలో కరోనా అనుమానితులు ఉంటే.. ఇరుగు పొరుగు వాళ్లు ఆందోళన చెందకుండా ప్రజాప్రతినిధుల్ని రంగంలోకి దింపారు. వాళ్లంతా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు.. వైరస్ నుంచి కాపాడటానికే అంటూ గృహనిర్బంధంపై విడమర్చి చెప్పేవారు. ఆ తర్వాత అనుమానితుల్ని ప్రత్యేక వార్డుల్లో చికిత్స కొనసాగించేవారు. 

 

ఇక చివరగా కేరళ ప్రభుత్వం తీసుకున్న మరో నిర్ణయం.. సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరగకుండా చూసుకోవడం. మొదట్లో ఆల్కహాల్ తీసుకుంటే కరోనా వస్తుందని.. వెజిటీరియన్ మాత్రం తీసుకుంటేనే కరోనా ఆపగలమని.. ఇలా రకరకాల వార్తలు వైరల్ అయ్యేవి. అయితే ప్రభుత్వం వీటిపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. సరైన సమాచారం ప్రజలకు అందేలా చర్యలు తీసుకుంది. అంతేకాకుండా కరోనా బాధితులు ఎంత మంది ?  ఇప్పటివరకు ఎంతమందికి పరీక్షలు నిర్వహించారు అనే సమాచారాన్ని ప్రభుత్వం.. ప్రతిరోజూ మీడియాలో ప్రచారం చేసింది. దీనివల్ల సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రచారం కాకుండా జాగ్రత్తపడ్డారు. 

 

ఇలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం వల్ల కేరళ సర్కార్.. కరోనా వ్యాప్తిని అడ్డుకోగలిగింది. 2018, 2019లో నిఫా.. ప్రమాద ఘంటికలు మోగించినప్పుడు నేర్చుకున్న పాఠాలే.. ఇప్పుడు కేరళ ప్రభుత్వానికి ఉపయోగపడ్డాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: