దేశంలో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ప్రతిరోజూ దేశవ్యాప్తంగా వందల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఏపీకి చెందిన ఒక వ్యక్తికి కరోనా నిర్ధారణ అయింది. ఏపీ వ్యక్తికి కరోనా సోకడంతో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 14 గ్రామాలను నిర్భంధంలో ఉంచారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా నిజంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఏపీకి చెందిన ఒక వ్యక్తి ఉత్తరప్రదేశ్ లోని బడౌన్ జిల్లా భవాన్ పూర్ కాలనీలో నివశిస్తున్నాడు. 
 
సదరు వ్యక్తి మార్చి నెలలో ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరై భవాన్ పూర్ కు తిరిగి వచ్చాడు. ఆ వ్యక్తి గ్రామానికి చేరుకున్న అనంతరం గ్రామస్థులు అతనిని క్వారంటైన్ లో ఉంచారు. రెండు రోజుల క్రితం ఆ వ్యక్తిలో కరోనా లక్షణాలు కనిపించడంతో అధికారులు పరీక్షలు జరిపించారు. పరీక్షల్లో అతనికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో బడాన్ జిల్లా కలెక్టర్ ఏపీ వ్యక్తి నివాసం ఉన్న గ్రామానికి మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్న గ్రామాలను మూసివేస్తున్నట్లు ప్రకటన చేశారు. 
 
ఒక వ్యక్తికి కరోనా నిర్ధారణ కావడంతో 14 గ్రామాలను నిర్భంధంలో ఉంచుతున్నామని కలెక్టర్ కుమార్ వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ లో ఇప్పటివరకు 483 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ కేసులలో ఎక్కువమంది ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలకు హాజరైన వారు, వారి సన్నిహితులే అని సమాచారం. మరోవైపు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. 
 
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో దాదాపు 960 కేసులు నమోదయ్యాయి. ప్రతిరోజూ కొత్త కేసులు నమోదవుతూ ఉండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు రేపు మోదీ లాక్ డౌన్ గురించి ఎలాంటి ప్రకటన చేస్తారో అని దేశ ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మోదీ రేపు రెండు వారాలు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: