లాక్ డౌన్ వేళ సకాలంలో  వైద్యం అందక రెండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. నిండు గర్భిణీని వెంట పెట్టుకొని అష్టకష్టాలు పడి దాదాపు ఆరు ఆస్పత్రులు తిరిగినా ఫలితం లేకుండా పోయింది. మహిళతో పాటు.. పుట్టిన బిడ్డా చనిపోవడం విషయం తెలుసుకున్న పలువురి హృదయాలను కలిచివేస్తోంది. 

 

సకాలంలో వైద్యం అందక తల్లీబిడ్డ మృతి చెందిన ఘటన గద్వాల జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గద్వాల జిల్లా రాజోలికి చెందిన జెనీలాకు  ఏడాది క్రితం అయిజ మండలం యాపదిన్నెకు చెందిన మహేంద్రతో  వివాహం అయింది .ఈ క్రమంలోనే  గర్భం దాల్చింది. లాక్ డౌన్ కారణంగా ఓ పక్క వాహన సదుపాయాలు లేక, మరో పక్క వైద్యం అందక  తల్లి బిడ్డ కన్నుమూశారు.  

 

నిండు గర్భిణీ అయిన జెనీలాకు నొప్పులొచ్చాయి. అంబులెన్స్‌కు ఫోన్‌ చేసినా రాకపోవడంతో,  ఆటోలో ఆమెను గద్వాల ప్రభుత్వాస్పత్రికి తరలించాడు భర్త. అక్కడ ఉన్న వైద్యులంతా  కరోనా సేవల్లో బిజీగా ఉన్నారు. అందుబాటులో ఉన్న వైద్య సిబ్బంది ఆమెను దగ్గర్లోని  కర్నూలు ఆసుపత్రికి తీసుకెళితే మంచిదని సూచించారు. అయితే రెడ్ జోన్ కారణంగా ఇతరులెవ్వరినీ పట్టణంలోకి రానివ్వని దుస్థితి అక్కడ నెలకొంది. ఇక అక్కడి నుంచి మహబూబ్ నగర్ ప్రభుత్వాసుపత్రికి  తరలించగా,  హైదరాబాద్ కు రిఫర్ చేశారు. 

 

అతికష్టం మీద హైదరాబాద్ లోని పేట్ల బురుజు హస్పిటల్ కు తరలించారు కుటుంబసభ్యులు. కరోనా ప్రభావిత ప్రాంతమైన గద్వాల నుంచి వచ్చారు.. కాబట్టి కోవిడ్ టెస్ట్ చేయించుకొస్తేనే వైద్యం అందిస్తామని డాక్టర్లు తేల్చి చెప్పారు. గాంధీకి వెళ్లి కరోనా పరీక్షలు చేయించుకొని రిపోర్టులు తెస్తే తప్ప,  ప్రసవం చేయలేదు అక్కడి వైద్యులు. ప్రసవం అయిన తరువాత మగ బిడ్డ పుట్టాడు అని వైద్యులు చెప్పిన మాటతో ఆ దంపతుల సంతోషం ఎక్కువ సేపు నిలవ లేదు. అప్పటికే ఉమ్మనీరు తాగిన శిశువు,  అనారోగ్యం బారిన పడి నీలోఫర్ లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆ మర్నాడు జెనిలా కూడా అనారోగ్యం తో మృతి చెందింది.  సకాలంలో వైద్యం అంది, ప్రసవం జరిగి ఉంటే ఇలాంటి పరిస్తితి వచ్చేది కాదంటున్నారు కుటుంబ సభ్యులు. మరోవైపు ఈ ఘటనపై మానవ హక్కుల సంఘం సుమోటాగా కేసు నమోదు చేసింది. పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది . 

 

మరింత సమాచారం తెలుసుకోండి: