ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కరోనా వైరస్ పంజా విసురుతోంది. రాష్ట్రంలో ప్రతిరోజూ 50కు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో ప్రజల్లో భయాందోళన పెరుగుతోంది. మరోవైపు రాష్ట్రంలో కోలుకున్న వ్యక్తులే మరలా కరోనా భారీన పడుతున్నారు. కోలుకున్న వారికే మరలా కరోనా సోకితే ఇప్పట్లో కరోనాను కట్టడి చేయడం సాధ్యం కాదని నిపుణులు, వైద్యులు చెబుతున్నారు. 
 
కొన్ని రోజుల క్రితం  రాష్ట్రంలోని వైజాగ్ లో ఒక వ్యక్తి కరోనా నుంచి కోలుకున్నాడు. మార్చి నెలాఖరులో ముంబై నుంచి వైజాగ్ వచ్చిన వ్యక్తికి కరోనా పరీక్షలు చేయగా వైరస్ నిర్ధారణ అయింది. చికిత్స అనంతరం రెండుసార్లు నెగిటివ్ రావడంతో వైద్యులు అతడిని డిశ్చార్జ్ చేశారు. తాజాగా ఆ వ్యక్తికి మళ్లీ కరోనా నిర్ధారణ అయింది. దీంతో షాక్ అవ్వడం వైద్యుల వంతయింది. గతంలో ఇదే వ్యక్తి కుటుంబానికి చెందిన ఐదుగురు కరోనా భారీన పడి డిశ్చార్జ్ అయ్యారు. 
 
తాజాగా వారి కుటుంబంలో 18 నెలల చిన్నారి కరోనా భారీన పడింది. ఆ చిన్నారి నుంచే యువకునికి మళ్లీ కరోనా సోకిందా..? లేక మరోసారి కరోనా తిరగబెట్టిందా...? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే వైద్యులు మరిన్ని పరీక్షలు నిర్వహించి కరోనాను నిర్ధారించాల్సి ఉందని చెబుతున్నారు. ఒకసారి కోలుకున్నవారు మరోసారి కరోనా భారీన పడితే కరోనాను నియంత్రించడం ఇప్పట్లో సాధ్యం కాదనే చెప్పాలి. 
 
మరోవైపు రాష్ట్రంలో ప్రతిరోజూ అధిక సంఖ్యలో కేసులు నమోదవుతూ ఉండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణలో కరోనా తగ్గుముఖం పట్టినా ఏపీలో వైరస్ ఉధృతి తగ్గడం లేదు. రాష్ట్రంలో నిన్న 54 మంది కరోనా భారీన పడ్డారు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1887కు చేరింది. రాష్ట్రంలో 842 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో 41 మంది మృతి చెందగా 1004 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: