ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ పేరుతో కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన ప్యాకేజీపై తెలంగాణ‌లో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ భ‌గ్గుమంది. కేంద్రం తీరును తీవ్రంగా దుయ్య‌బ‌ట్టింది. ఈ ప్యాకేజీపై ఇప్ప‌టివ‌ర‌కు తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించ‌క‌పోగా...ప్ర‌భుత్వం త‌ర‌ఫున సీఎం కేసీఆర్ న‌మ్మిన‌బంటు అనే పేరున్న రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ రియాక్ట‌య్యారు. ప్ర‌తి రోజూ ఏదో ఒక రంగానికి సహాయం చేయటానికి అంటూ మోసపూరిత ప్రకటనలు చేస్తున్నారని, నేరుగా ఎవ్వరికీ ఆర్థిక సాయం చేయడంలేదని ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. 

 

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ ప్రకటించిన ఉద్దీపన చర్యల్లోనూ రాష్ట్రాలకు ఎలాంటి సహాయం ప్రకటించలేదని వినోద్‌కుమార్ మండిప‌డ్డారు. ఆర్థికమంత్రి ప్రకటనల్లో ప్రచార ఆర్భాటం తప్ప మరేమీలేదని విమర్శించారు. ప్రధాని, ఆర్థికమంత్రి తీరును ఆయన ఖండించారు. ``కష్టాల్లో ఉన్న ప్రజలకు తప్పుడు ఆశలు కల్పిస్తున్న కేంద్రం ఆచరణలో ఏ విధంగానూ సాయం చేయటం లేదు. ప్రతిరోజూ ఏదో ఒక రంగానికి సహాయం చేయటానికంటూ మోసపూరిత ప్రకటనలు చేస్తున్నారే కానీ నేరుగా ఎవ్వరికీ ఆర్థిక సాయం చేయడం లేదు. కేంద్ర ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తికి విరుద్దంగా వ్యవహరిస్తోంది. రాష్ట్రాల  ప్రతిపాదనలు కనీసం పరిశీలించకపోవటం దారుణం` అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

 


20 లక్షల కోట్ల ప్యాకేజీతో కష్టల్లో ఉన్న ఏ ఒక్క సామాన్యుడికి ప్రయోజనం కలిగేలా లేదని వినోద్ కుమార్ అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. ఆర్థిక ప్యాకేజీ కష్టాల్లో ఉన్నవారిని తక్షణం ఆదుకునేలా ఉండాలని, కేంద్ర ప్రకటనలు మాత్రం వాస్తవానికి దూరంగా ఉన్నాయన్నారు. ``ఏ రంగంలోనైనా సంస్కరణలు కొనసాగుతుంటాయి. వాటి ఫలితాలు రావడానికి క్షేత్రస్థాయిలో కొంత సమయం పడుతుంది. కానీ, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక ప్యాకేజీ ఉత్త డొల్ల అని పేర్కొన్నారు. వీటి ఫలితాలు వచ్చేదెన్నడు.? పేదల కడుపు నిండేది ఎన్న‌డు?`` అని ఆయ‌న ప్ర‌శ్నించారు. ``అణువిద్యుత్‌, గనులు, అంతరిక్షం విభాగం, రక్షణ రంగాల్లో చేపట్టే సంస్కరణలు తక్షణ సహాయ చర్యల కిందికి ఎలా వస్తాయి? దేశంలో ఆర్థిక సంక్షోభం నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రపాలిత ప్రాంతాల్లోని విద్యుత్‌ డిస్కంలను ప్రైవేటీకరించడం ఏ విధంగా సరైన నిర్ణయం?  ప్రజలకు ఉపశమనం కల్గించే చర్యలు చేపట్టాల్సిన సమయంలో సంస్కరణలు చేస్తున్నారు. ఉపశమన చర్యల పేరుతో దుర్మార్గంగా వ్యవహరిస్తూ సంస్కరణలను ప్రకటిస్తున్నారు` అని దుయ్యబట్టారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: