రష్యాలో కరోనా మహమ్మారి అల్లకల్లోలం సృష్టిస్తోంది. అక్కడి పరిస్థితులు చూస్తుంటే.. రష్యా మరో అమెరికాలా మారనుందా అనే సందేహం వస్తోంది. ముఖ్యంగా రష్యా రాజధాని మాస్కోలో కరోనా తన ప్రతాపమేంటో చూపిస్తోంది. ఎక్కడ చూసినా కరోనా కేసులే ఉండటం ఆందోళన కలిగించే విషయం. రష్యాలోని మారుమూల ప్రాంతాల్లోనూ కరోనా తన విజృంభణ కొనసాగుతోంది. 

 

కరోనా వైరస్ తొలి స్టేజ్ లో ఉన్నప్పుడు దానిని విజయవంతంగా కట్టడి చేసిన కొన్ని దేశాల జాబితాలో రష్యా కూడా ఉంది. వుహాన్‌లో కరోనా విజృంభించక ముందే చైనాతో సరిహద్దులను మూసేసిన రష్యా...లాక్‌డౌన్‌ను కఠినంగానే అమలు చేయడంలో సఫలమైంది. అయితే రెండు నెలలు గడిచే సరికి పరిస్థితి పూర్తిగా తలకిందులైపోయింది. అమెరికా స్థాయిలో  రష్యాలో కూడా కరోనా కేసులు వేగంగా విస్తరించాయి. పుతిన్ ప్రభుత్వం తీసుకున్న కరోనా నియంత్రణ చర్యలు  ఫలించలేదు.

 

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు ఎక్కువగా ఉన్న రెండో దేశంగా రష్యా నిలిచింది. అమెరికాతో పోల్చితే  కరోనా మరణాల సంఖ్య తక్కువగానే ఉన్నా... కేసులు మాత్రం విజృంభిస్తున్నాయి. తాజాగా 9 వేల ఏడు వందల కేసులు నమోదు కావడంతో రష్యా ట్యాలీ 2 లక్షల 82 వేలకు చేరుకుంది. స్పెయిన్, యూకే, బ్రెజిల్‌ను కిందకు నెట్టేసి... రెండో స్థానంలోకి చేరుకుంది రష్యా...రాజధాని మాస్కో మొత్తం కరోనా వ్యాపించింది. దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో సగానికిపైగా మాస్కోలోనే ఉన్నాయి. కరోనా పేషెంట్లకు ట్రీట్‌మెంట్ ఇచ్చేందుకు ప్రత్యేకంగా ఆస్పత్రి నిర్మించారు. 

 

వారం రోజుల క్రితం వరకు మాస్కో చుట్టు పక్కల ప్రాంతాలకే పరిమితమైన కరోనా వైరస్...ఇప్పుడు దేశవ్యాప్తంగా వ్యాపించింది. రష్యాలో 11 టైమ్ జోన్స్ ఉంటే... అన్నింటా కరోనా కేసులున్నాయి.  మారుమూల ప్రాంతాలకు కూడా కరోనా వ్యాపించడం పుతిన్ ప్రభుత్వాన్ని ఆందోళనలోకి నెడుతోంది. పుతిన్ అన్ని ప్రాంతాల నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. విస్తీర్ణ పరంగా పెద్ద దేశం కావడంతో స్థానికంగా ఉన్న పరిస్థితులను బట్టి లాక్‌డౌన్ నిబంధనలను అమలు చేయాలని పుతిన్ అధికారులకు సూచించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: