గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు రంగం సిద్ధమైపోయింది. మరి కొద్ది గంటల్లో పోలింగ్ జరగనుంది. రాజకీయ పార్టీల  నేతల అభ్యర్ధనలు పూర్తి అయ్యాయి. ఇక మిగిలింది ఓటరన్న దయ. గ్రేటర్ ఎన్నికలలో ఓటర్లు పోలింగునకు రెడీ అవుతున్నారా. వారికి ఆ ఉత్సాహం ఉందా అన్న చర్చ ఇపుడు ముందుకు వస్తోంది.

నిజానికి గ్రేటర్ హైదరాబాద్ లో 80 లక్షల మంది దాకా ఓటర్లు ఉన్నారు. వీరిలో అన్ని రాష్ట్రాలు, ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారు. వారంతా కనుక పోలింగ్ బూతుల  మీదకు దండెత్తితే ఈసారి రికార్డ్ స్థాయిలో ఓటింగ్ జరుగుతుంది అంటున్నారు. ఈసారి ఓటింగునకు జనం వచ్చే దాన్ని బట్టి, వారి ప్రతిస్పందనను బట్టే విజయం ఎవరికి దక్కుతుందో కూడా చెప్పాల్సి ఉంటుంది.

గతసారి ఎన్నికలు అంటే 2016లో జరిగిన దాన్ని కనుక చూసుకుంటే యాభై శాతం మాత్రమే పోలింగ్ జరిగినట్లుగా రికార్డులు చెబుతున్నాయి. అంటే అది ఎవరేజ్ ఓటింగ్ అన్న మాట. ఆనాడు ఉన్న పరిస్థితులు, టీయారెస్ దూకుడు. అపుడే అధికారంలోకి వచ్చిన టీయారెస్ ఇచ్చిన హామీలు, తెలంగాణా ఉద్యమం ప్రభావం ఇవన్నీ కలసి కచ్చితంగా టీయారెస్ గెలుస్తుంది అన్న అంచనాలు ముందే ఉన్నాయి.

దాంతో ముందే డిసైడ్ అయిన దానికి కొత్తగా వెళ్ళి ఓటు చేసేది ఏముంది అన్న భావనతో కూడా చాలా మంది ఓటింగునకు వెళ్లలేదు అంటారు. కానీ ఈసారి అలా కాదు, ఆరున్నరేళ్ళు టీయారెస్ అధికారంలో ఉంది. గ్రేటర్ లో అయిదేళ్ళ పాలన కూడా జనాలు చూశారు. ఎన్ని హామీలు అమలయ్యాయి. ఎన్ని కాలేదు అన్న దాని మీద వారికి ఒక అంచనా ఉంది. పైగా ఇపుడు బీజేపీ ఆల్టర్నేషన్ గా కనిపిస్తోంది. వరదల ప్రభావం, ప్రజా వ్యతిరేకత, కరోనా ప్రభావం ఇవన్నీ కూడా ఎన్నికల వేళ గ్రేటర్ ఓటర్ మదిలో మెదులుతాయి. దాంతో ఈసారి గతానికంటే కూడా ఓటింగు పెరగవచ్చు అంటున్నారు. అదే కనుక జరిగితే గులాబీ పార్టీకి అది డేంజర్ సింగ్నలే.  అదే సమయంలో కమల వికాసానికి కూడా నాంది అవుతుంది అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: