ఎన్నికల్లో ప్రజల మూడ్ ఎలా ఉన్నా.. కొన్ని కొన్ని సార్లు సర్వేలు వారిపై గట్టి ప్రభావాన్ని చూపిస్తాయి. గ్రేటర్ ఎన్నికల్లో కూడా ఓటర్లపై సర్వేలు ప్రభావం చూపిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే సోషల్ మీడియాని పూర్తిగా తమ గుప్పెట్లో పెట్టుకున్న బీజేపీ.. తప్పుడు వార్తలతో ప్రజల్ని తప్పుదారి పట్టిస్తోందని ఇటీవల మంత్రి హరీష్ రావు తీవ్రంగా విమర్శించారు. అయితే అదే సోషల్ మీడియాని వాడుకుంటూ టీఆర్ఎస్ మరో మాస్టర్ ప్లాన్ వేసింది. ఎన్నికలకు ఒకరోజు ముందు సర్వేలంటూ హడావిడి మొదలు పెట్టింది.

ఎప్పుడు చేశారో, ఎవర్ని చేశారో తెలియదు కానీ సర్వే మాత్రం జరిగింది, దానిలో టీఆర్ఎస్ కే ఎడ్జ్ ఉంది అంటూ కొన్ని వెబ్ సైట్లు కథనాలు వండి వార్చాయి. వాస్తవానికి గ్రేటర్ ఎన్నికల రణక్షేత్రంలో ప్రజల మూడ్ ఇదీ అని చెప్పగలిగే పరిస్థితి లేదు. దుబ్బాక ఫలితం ప్రతిబింబిస్తుందని చెప్పలేం, అదే సమయంలో వరదల వల్ల ప్రజలు పడిన కష్టనష్టాల్నీ తక్కువగా అంచనా వేయలేం. స్థానిక పరిస్థితులతోపాటు.. బీజేపీ జాతీయ అగ్ర నాయకత్వాన్ని ప్రచారంలో దింపి మరింత కాక పెంచింది. టీఆర్ఎస్, ఎంఐఎం ని ఒకే గాటన కట్టి తీవ్ర విమర్శలు చేసింది. ఈ నేపథ్యంలో ప్రజలు ఎవరివైపు ఉన్నారు, ఎవరికి మెజార్టీ వస్తుందనే విషయం అంచనాలకు అందకుండా ఉంది.

అయితే ఎన్నికల ముందురోజు ప్రీపోల్ సర్వే ఫలితాలంటూ కొన్ని వెబ్ సైట్లు టీఆర్ఎస్ కి మేలు చేకూర్చేలా వార్తలు రాశాయి. అయితే టీఆర్ఎస్ బలం తగ్గుతుందని 100 సీట్లు దాటలేదని మాత్రం తేల్చేశాయి. మొత్తమ్మీద టీఆర్ఎస్ కే మరోసారి గ్రేటర్ పీఠం దక్కుతుందని వార్తలిచ్చినా, జనాలు పూర్తిగా నమ్మరేమోనన్న అనుమానంతో సెంచరీ కొట్టలేరంటూ మెలిక పెట్టాయి. ఏపీలో వైసీపీ అనుకూల వెబ్ సైట్లలో ఈ ప్రచారం జరగడన గమనార్హం. వాస్తవాలు ఎలా ఉంటాయనే విషయం ఎగ్జిట్ పోల్స్ తో మాత్రమే తేలుతుంది. అయితే ఇటీవల బీహార్ విషయంలో ఎగ్జిట్ పోల్స్ పూర్తిగా తేడా కొట్టేశాయి. దుబ్బాకలో కూడా బీజేపీ విజయాన్ని ఎక్కువ సర్వేలు ఊహించలేకపోయాయి. అందుకే గ్రేటర్ లో కూడా ఎగ్జిట్ పోల్స్ నీ పూర్తి స్థాయిలో నమ్మలేం. రిజల్ట్ రోజే అసలైన విషయం బైటపడుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: