తెలుగు రాష్ట్రాల్లో త్వరలోనే లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో పర్యటిస్తున్నారు. తాజాగా ఏపీకి విచ్చేసిన మోదీ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పెట్టిన ఒక ఎన్నికల ప్రచార సభకు హాజరయ్యారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ ఏపీ డెవలప్ కావాలంటే డబుల్‌ ఇంజన్‌ సర్కారు అధికారంలోకి రావాలని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

'గోదావరి మాతకు ప్రణామాలు.. ఈ నేల మీదే ఆదికవి నన్నయ్య తొలి కావ్యం రాశారు. ఇక్కడి నుంచే ఇప్పుడు కొత్త చరిత్ర లిఖించబోతున్నాం.' అని మోదీ తెలుగులో స్పీచ్ స్టార్ట్ చేశారు. దాంతో సమావేశానికి హాజరైన వారందరూ చప్పట్లు కొడుతూ హోరెత్తించారు. మోదీ మాట్లాడుతూ దేశంలోనే కాకుండా ఏపీ రాష్ట్రంలో కూడా ఎన్డీయే కూటమి విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. "వైసీపీ సర్కార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతిని పెంచేసింది. అభివృద్ధి చేసింది ఏమీ లేదు.. కానీ అవినీతి మాత్రం 100% రెట్టింపు అయింది." అని ప్రధాని షాకింగ్ కామెంట్స్ చేశారు.

భారతదేశమైనా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమైనా డెవలప్ కావాలంటే ఎన్డీయేనే పరిపాలనలో ఉండాలని, వైసీపీ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని మోదీ ధ్వజమెత్తారు. "ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత చాలా ప్రతిభావంతులు. టెక్నాలజీలో వారికి సాటి వచ్చేవారు ఎవరూ ఉండరు. దేశం వేగంగా డెవలప్ అవుతున్న వేళ రాష్ట్రం కూడా అంతే స్పీడ్ తో అభివృద్ధి చెందాలి కానీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రాజెక్టుల అమలును ఆలస్యం చేస్తోంది. దేశంలో రాష్ట్రంలో ఒకే సర్కారు ఉంటే మాత్రమే వీటిలో జాప్యం ఉండదు." అని చెప్పుకొచ్చారు.

ఇదే సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా విమర్శించారు. హస్తం పార్టీని నమ్మితే దేశం పరిస్థితి అధోగతి అవుతుందని హెచ్చరించారు. దేశం వెనుకబడిందంటే దానికి కాంగ్రెస్ పార్టీనే కారణమని అన్నారు. ఈ పార్టీ నేతల వద్ద ఉన్న గుట్టల కొద్దీ అక్రమ సొమ్ము ఇప్పుడిప్పుడే బయటపడుతుందని మోదీ పేర్కొన్నారు. మళ్లీ వైసీపీని విమర్శిస్తూ మూడు రాష్ట్రాలు అంటూ ఏపీని వైకాపా ప్రభుత్వంలో లూటీ చేసిందని ఆరోపించారు. ఆల్కహాల్ బ్యాన్ చేస్తామనే నినాదంతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ఆ తర్వాత లిక్కర్ సిండికేట్ గా మారిందని ఎద్దేవా చేశారు. అయితే ప్రస్తుతం మోదీ చేసిన కామెంట్స్ వైసీపీ నేతలకు షాక్స్‌ ఇస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: