న్యూఢిల్లీ: పాకిస్థాన్ నుంచి ప్రత్యేక సింధ్ దేశం ఏర్పాటు చేయాలంటూ ఎంతో కాలం నుంచి పోరాటం జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ప్రత్యేక దేశం ప్రకటించాంటూ నిరసన కారులు ఉద్యమించారు. ఆధునిక సింధి జాతీయ వాదం వ్యవస్థాపకుల్లో జీఎం సయ్యద్ కూడా ఒకరు. ఆయన 117వ జయంతి కావడంతో.. సింధ్ ప్రత్యేక దేశానికి సంబంధించిన స్వాతంత్ర్య అనుకూల ర్యాలీ పాకిస్థాన్‌లో భారీగా జరిగింది. నిరసన కారులు సింధ్ దేశం ఏర్పాటు చేయాలంటూ నినదించారు. సయ్యద్ స్వస్థలమైన సింధ్ ప్రావిన్స్‌లో నిరసన కార్యక్రమం జరిగింది.

జమ్ షోరో జిల్లా సాన్ ప్రాంతంలో ఆదివారం నిరసన కారులు స్వాతంత్ర్య ర్యాలీని నిర్వహించారు. ఈ సంద్భంగా వారంతా భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఇతర దేశాధినేతల ప్లకార్డులను ఈ ర్యాలీలో ప్రదర్శించారు. మోదీతో పాటు ప్రపంచ దేశాధినేతలు సింధ్ దేశం కోసం స్పందించాలని, ఈ విషయంలో వారు జోక్యం చేసుకోవాలని కోరారు. సింధ్ లోయ నాగరికతకు, వేద మతానికి పుట్టినిల్లంటూ నిరసన కారులు నినదించారు. బ్రిటిషర్లు ఈ ప్రాంతాన్ని 1947లో దుర్మార్గులైన ఇస్లామిస్టుల చేతుల్లో పెట్టారని వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. కాగా.. పాకిస్థాన్‌లో సింధ్‌లో అనేక జాతీయ వాద పార్టీలు ఉండగా.. సింధ్ దేశం కోసం అవన్నీ తమకు తోచిన విధంగా పోరాటాలు చేస్తూనే ఉన్నాయి.

వివిధ అంతర్జాతీయ వేదికలపై తమకు అవకాశం వచ్చినప్పుడల్లా తమ గళాన్ని వినిపిస్తూ ప్రత్యేక దేశం కోసం పోరాడుతున్నాయి. పాకిస్థాన్‌ తమను ఆక్రమించిందంటూ మండిపడుతున్నాయి. తమ సంపద, వనరులను ఇస్లామిస్ట్‌లు దోచుకుంటూ మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నట్టు సంచలన ఆరోపణలు చేస్తున్నాయి. కాగా.. సింధ్ ప్రత్యేక దేశ ఏర్పాటు అంశం ఇప్పటిది కాదు. ఎన్నో ఏళ్ల నుంచి కొనసాగుతూనే ఉంది. తమకు అవకాశం దొరికినప్పుడల్లా సింధ్ ప్రత్యేక దేశానికి సంబంధించి ఏదో ఒక విధమైన పోరాటం చేస్తూనే వస్తున్నారు. మరి ఈ అంశంలో ప్రపంచ దేశాధినేతలు స్పందిస్తారో లేదో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: