తెలంగాణలో అధికారం కోసం పావులు కదుపుతున్న బీజేపీ.. త్వరలో జరగనున్న నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికను సవాల్ గా తీసుకుంటోంది. దుబ్బాక అసెంబ్లీ బైపోల్ లో సంచలన విజయం, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అనూహ్యా ఫలితాలు సాధించి దూకుడు మీదుంది కమలదళం. తమకు ఇప్పటివరకు ఏ మాత్రం పట్టులేని నాగార్జున సాగర్ లోనూ గెలిస్తే.. తమకిక తెలంగాణలో తిరుగే ఉండదని భావిస్తోంది.అందుకే నాగార్జున సాగర్ కోసం ప్రత్యేక వ్యూహాలు రచిస్తోంది.  అయితే నాగార్జున సాగర్ లో బీజేపీకి కొత్త సమస్యలు వస్తున్నాయి.

    నాగార్జునసాగర్ నియోజకవర్గ  బీజేపీలో అసమ్మతి సెగ మొదలైంది. సాగర్ ఉపఎన్నికలో పోటీ చేసేందుకు గతంలో ఎన్నడూ లేనివిధంగా  నేతల మధ్య పోటీ నెలకొంది. ఈ క్రమంలోనే నేతల మధ్య వర్గపోరు ముదురుతోంది.  నాగార్జునసాగర్ నియోజకవర్గ బీజేపీ రెండు గ్రూపులుగా మారిపోయింది. ప్రస్తుత నల్లగొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు కంకణాల శ్రీధర్‌రెడ్డి భార్య నివేదితారెడ్డి సాగర్ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గత ఎన్నికల్లోనూ నివేదితా సాగర్ నుంచి బీజేపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు.  బీసీ సామాజికవర్గంలో మంచి నేతగా గుర్తింపు ఉన్న కడారి అంజయ్యయాదవ్ ఉపఎన్నిక టికెట్ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య విభేదాలు తీవ్రమయ్యాయని తెలుస్తోంది.తనకే టికెట్ వచ్చిందని ఇద్దరు నేతలు ప్రచారం చేసుకుంటుండటంతో కమలం కేడర్ గందరగోళంలో పడిపోయిందట.  

            గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయామని.. అందుకే ఈసారి టికెట్ మాకే ఇవ్వాలని కంకణాల నివేదిత కోరుతోంది. అయితే గత ఎన్నికల్లో పోటీ చేసి డిపాజిట్ కోల్పోయారని.. బీసీ సామాజిక నేతగా మంచి గుర్తింపు ఉన్న తనకే టికెట్ ఇవ్వాలని అంజయ్యయాదవ్ చెబుతున్నారట. వీళ్ల గొడవ ఇలా ఉండగానే... టీఆర్ఎస్ లోని కొందరు నేతలు కూడా కమలం పెద్దలతో టచ్ లోకి వచ్చినట్లు చెబుతున్నారు. దీంతో  సాగర్ ఉపఎన్నిక టికెట్ ఎవరికీ కేటాయించాలనే విషయంపై బీజేపీ అధిష్టానం మల్లగుల్లాలు పడాల్సి వస్తోందని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: