ప్రపంచంలో వాలంటీర్లు అనే పదాన్ని తామే కనిపెట్టామని అధికార వైసిపి భావిస్తూ ఉంటుంది. అసలీ వాలంటీర్ వ్యవస్థ అవసరం లేదని టిడిపి ఆరోపిస్తుంటే ప్రజలకు పథకాలు చేరువ కావాలంటే ఇలాంటి ఒక వ్యవస్థ కావాలని అధికార వైసిపి వాదిస్తోంది. అయితే అనంతపురం జిల్లా విషయానికి వస్తే గ్రామ వాలంటీర్లు సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఈ వ్యవస్థను తక్షణమే రద్దు చేయాలని నిన్న టిడిపి నేత తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. నిన్న కళ్యాణదుర్గంలో పర్యటించిన ఆయన స్థానిక నియోజకవర్గ ఇన్చార్జి ఉమామహేశ్వర నాయుడు స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాలంటరీ వ్యవస్థ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పని చేయాల్సి ఉందని కానీ ఎన్నికల్లో అధికార పార్టీకి ఓట్లు వేయించేందుకు మాత్రమే ఈ వ్యవస్థ పనికొస్తుందని విమర్శించారు. 

టిడిపికి ఓటు వేస్తే రేషన్ కార్డులు, పింఛన్లు, ఇళ్ల పట్టాలు, అమ్మఒడి రద్దు చేస్తామని బెదిరిస్తూ అధికార పార్టీ ఓట్లు వేయించుకోవడం దౌర్భాగ్యం అని ఆయన విమర్శించారు.. రాష్ట్రంలో టిడిపికి అపూర్వ ఆదరణ లభిస్తోందని దానిని జీర్ణించుకోలేక వైసిపి ప్రభుత్వం నీచ సంస్కృతికి ఒడిగడుతోందని అన్నారు. చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో కూడా ఎవరిని నామినేషన్లు వేయకుండా వైసీపీ నేతలు అడ్డుకున్నారని ఆయన విమర్శించారు. ఇలా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఏకపక్షంగా గెలిచామని ప్రచారం చేసుకోవడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.

 ఇక వాలంటీర్ల మీద టిడిపి నేతలు ఇంతలా విమర్శలు చేస్తూ ఉంటే దానికి తగ్గట్టే ఈ వాలంటీర్లు ప్రవర్తిస్తూ ఉండడం గమనార్హం. నిన్న రాయదుర్గం పట్టణంలో వైసిపి నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో కొందరు వార్డు వాలంటీర్లు పాల్గొని వైసీపీ కార్యకర్తలుగా వ్యవహరించడం ఆసక్తికరంగా మారింది. నిన్న రాయదుర్గం 28 వ వార్డు లో టిడిపి సీనియర్ నాయకుడు ఒకరు ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో ఆ 28 వ వార్డు కు సంబంధించిన వాలంటీర్లు సుమన్, మురళి ఇద్దరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వైసీపీ నాయకులతో కలిసి గ్రూప్ ఫోటోలు కూడా దిగారు. ఒక పక్క టిడిపి విమర్శలకు మరో పక్క వీళ్ళు చేసే పనులకు సరిగ్గా సరిపోతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: