ఇంటర్నెట్ డెస్క్: ప్రధాని మోదీ, అమిత్ షాలు ప్రజలకు క్షమాపణలు చెప్పారు. ఓ విషయంలో తమను మన్నించాలంటూ బహిరంగంగా కోరారు. ప్రస్తుతం ఈ విషయం దేశ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. దేశ ప్రధాని, హోం మంత్రి అమిత్ షాలే ప్రజలకు క్షమాపణలు చెప్పడం ఏంటంటూ తీవ్ర చర్చ జరుగుతోంది. అయితే ఇంతకీ వారిద్దరూ ఎందుకు క్షమాపణ చెప్పారో తెలుసా..? తమిళ భాషలో మాట్లాడలేకపోతున్నందుకట. ఈ రోజు(ఆదివారం) జరిగిన 'మన్ కీ బాత్' రేడియా కార్యక్రమంలో మాట్లాడిన మోదీ.. దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని పలు ఆసక్తికర విషయాలను మాట్లాడారు.

 'ఏదైనా చేయాలనుకుని.. మీరు చేయలేకపోయారా..? అది ఏమిటో చెప్పండి..? అని ఒక వ్యక్తి కొద్దిరోజుల క్రితం తనను అడిగారని, ఆ ప్రశ్నతో తనను తాను ప్రశ్నించకున్నానని మోదీ అన్నారు. ఈ క్రమంలోనే తమిళభాష నేర్చుకోలేదనే బాధ తనకు తెలిసిందని అన్నారు. ప్రపంచంలోనే అతి పురాతమైన తమిళ భాష నేర్చుకునేందుకు తగిన ప్రయత్నం చేయలేకపోయానని, అదే తనను బాగా బాధించిందని మోదీ పేర్కొన్నారు.

ఇక మోదీ బాటలోనే కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సైతం తనకు తమిళం రానందుకు విచారం వ్యక్తం చేశారు. పుదుచ్చేరి ఎన్నికల ప్రచారంలో నేడు పాల్గొన్న అమిత్‌షా కరైకాల్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ఆ ప్రసంగంలోనే తమిళం ప్రస్తావన చేశారు. తమిళ భాష మాట్లాడలేకపోయినందుకు బాధపడ్డారు. దేశంలోనే అతి పురాతన భాషల్లో తమిళం ఒకటని, అంతేకాకుండా తమిళం అతి మధురమైన భాష అని, అంత చక్కటి భాషలో మాట్లాడలేకపోతున్నందుకు విచారంగా ఉందని అమిత్ షా అన్నారు. ఈ విషయంలో తనను మన్నించాలని ప్రజలను కోరారు.

ఇదిలా ఉంటే తాజగా తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల నగారా మోగిన విషయం తెలిసిందే. త్వరలో రెండు చోట్లా ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే పార్టీల ప్రచారాలు కూడా ఊపందుకుంటున్నాయి. ఇలాంటి తరుణంలో ప్రధాని మోదీ, అమిత్‌షాలు ఒకేసారితమిళంపై తమకున్న మక్కువ చాటుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. అంతేకాదు కొద్ది రోజుల క్రితం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా తమిళం నేర్చుకోనందుకు బాధపడుతున్నానని చెప్పడం కొసమెరుపు.

మరింత సమాచారం తెలుసుకోండి: