హైదరాబాద్: తెలంగాణ రేషన్ దుకాణాల నిబంధనల్లో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని మార్పులు చేసింది. ఇక నుంచి సరుకులు తీసుకోవాలంటే బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ అవసరం లేదని తెలిపింది. దాని స్థానంలో ఇక నుంచి మొబైల్‌కు వచ్చే ఓటీపీ చెప్పాల్సి ఉంటుందని ప్రకటించింది. రాష్ట్రంలో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి రేషన్ సరకులు పంపిణీలో ఈ పద్ధతిని అమలు చేయనున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ అధికారులు తెలిపారు. దీనికోసం రేషన్ కార్డు లబ్ధిదారులు తప్పనిసరిగా తమ ఫోన్ నెంబరకు ఆధార్ కార్డు అనుసంధానం చేసుకోవాలని, అప్పుడే ఈ ఓటీపీ వస్తుందని వారు వెల్లడించారు.

‘రేషన్ షాపుల్లో ఉన్న బయోమెట్రిక్ ఈ పాస్ యంత్రంలో ఇప్పటి వరకూ లబ్ది దారులు తమ వేలిముద్రలు వేసి సరకులు పొందేవారు. అయితే కరోనా వల్ల గత సంవత్సరం కొందరు స్వచ్ఛంద వాలంటీర్లతో ఈ సరుకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించాం. అయితే ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఇలా పంపిణీ చేయడాన్ని నిలిపివేస్తున్నాం. ఇక నుంచి ప్రజలు రేషన్ దుకాణాలకు వెళ్లి సరుకులు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు ఇకనుంచి సరుకుల పంపిణీ కోసం ఇంతకుముందు ఉన్న బయోమెట్రిక్ విధానాన్ని తొలగిస్తున్నాం. ఇకనుంచి సరుకుల పంపిణీ కోసం ప్రజల ఐరిస్, ఓటీపీ(మొబైల్‌కు వచ్చే వన్ టైం పాస్‌వర్డ్) సాంకేతిక పరిజ్ఞానం ద్వారా రేషన్ సరకులు పంపిణీ చేయడం జరుగుతుంద’ని అధికారులు పేర్కొన్నారు.

రేషన్ వినియోగదారులు దుకాణానికి వచ్చినప్పుడు ఈ పాస్ యంత్రం నుంచి వారి మొబైల్ 2కు వన్ టైం పాస్ వర్డ్(ఓటీపీ) వస్తుందని, అయితే దీనికోసం వారి మొబైల్ నెంబరు ఆధార్ కార్డుతో అనుసంధానం అవ్వాల్సి ఉంటుంది. ఆ ఓటీపీని బయోమెట్రిక్ యంత్రంలో నమోదు చేసిన వెంటనే వాని వివనాలన్నీ వస్తాయి. వాటి ఆధారంగా వారికి  డీలర్లు సరకులను పంపిణీ చేస్తారు. ఈ సరికొత్త పద్ధతి వల్ల సరుకుల పంపిణీలో అక్రమాలకు అడ్డుకునే అవకాశముంటందని అధికారులు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే ఇప్పటివరకు తమ మొబైల్ నెంబర్లకు ఆధార్ లింక్ చేయనివారు జనవరి 31లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని పౌర సరఫరా అధికారులు సూచించారు. అప్పుడే ఫిబ్రవరిలో ఇచ్చే సరుకులు తీసుకునేందుకు అర్హులవుతారని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: