దేశంలో రాజకీయ నాయకులు చాలా మంది ఉంటారు. కానీ.. కొందరినే చరిత్ర గుర్తు పెట్టుకుంటుంది. అలాంటి వారిలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకరు. చంద్రబాబునాయుడు.. దేశంలోనే సీనియర్ మోస్ట్ పొలిటీషియన్.. ఆయన దాదాపు పాతికేళ్ల క్రితమే ఓ రాష్ట్రానికి సీఎంగా పని చేసిన వ్యక్తి.. 20 ఏళ్ల క్రితమే విజన్ 2020 అంటూ.. స్వర్ణాంధ్ర ప్రదేశ్ అంటూ కలలు కన్న వ్యక్తి. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కాకుండా సీఈవోగా పని చేస్తున్నారని ప్రశంసలు పొందిన వ్యక్తి.

అభివృద్ధి ప్రదాత అంటూ ఆనాటి మీడియాతో వేనోళ్ల పొగడబడిన వ్యక్తి చంద్రబాబు. అంతేనా.. ఈ దేశానికి ప్రధాన మంత్రులను ఎంపిక చేసిన ఘనత కూడా చంద్రబాబు సొంతం. ఎన్టీఆర్ అల్లుడిగా రాజకీయాల్లో మొదట ప్రాధాన్యం లభించినా.. తన చాణక్యంతో ఆ ఎన్టీఆర్‌ నే నడిపించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు వల్లే ఎన్టీఆర్ తాపీగా తన పని తాను చేసుకోగలిగాడని అప్పటి రాజకీయాలు చూసిన వారు చెబుతారు.

ఇక ఎన్టీఆర్ తర్వాత ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన చంద్రబాబు.. రాజకీయాన్ని కొత్త పుంతలు తొక్కించారు. అభివృద్ధి రాజకీయాలకు తెర తీశారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు మాట్లాడదామని.. మిగిలిన సమయంలో అభివృద్ధే ఎజెండాగా పని చేద్దామని పిలుపు ఇచ్చిన రాజకీయ నాయకుడు చంద్రబాబు. ఓ ముఖ్యమంత్రికి విజన్ ఎంత ముఖ్యమో తెలియజెప్పిన వ్యక్తి చంద్రబాబు. రాబోయే కాలాన్ని ఊహించి అందుకు తగిన వ్యూహాన్ని సిద్ధం చేసే దార్శినికుడుగానూ చంద్రబాబుకు మంచి పేరుంది.

ప్రజల వద్దకే పాలన అని ప్రజల వద్దకే అధికారులను తెప్పించిన  మొట్టమొదటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. జన్మభూమి అనే కార్యక్రమంతో ప్రతిరోజు ఒక అంశంపై ప్రజలతో ప్రతిజ్ఞ చేయించి సామాజిక బాధ్యతను తెలియచెప్పారు. శ్రమదానం పేరుతో ప్రజలలో సామాజిక చైతన్యం తీసుకువచ్చారు. బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి వారిని సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధిలోనికి తెచ్చారు. 3 కిమీ ఒక పాఠశాల , మండలానికి ఒక జూనియర్ కళాశాల, పట్టణానికి ఒక ఇంజనీరింగ్ కళాశాల తీసుకొచ్చారు. సాఫ్ట్ వేర్ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి లక్షలాది యువకులకు ఉద్యోగ అవకాశాలను కలిపించారు. ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు విజయాలెన్నో. ప్రస్తుతం ఆయన కష్టకాలం ఎదుర్కొంటున్నా.. రెట్టించిన ఉత్సాహంతో మళ్లీ అధికారం చేపట్టే అవకాశాలు లేకపోలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: