రెండు పార్టీలూ రోడ్డెక్కాయి కాదు అస్త‌వ్య‌స్తంగా ఉన్న రోడ్ల‌పై మాట్లాడుతున్నాయి..మీదంటే మీదే త‌ప్పు అని మీడియా మీట్ లు పెడుతున్నాయి. ఇదీ వైసీపీ,టీడీపీ మ‌ధ్య ర‌గులుతున్న మాట‌ల యుద్ధం...మాట‌ల వ‌ర‌కే ఈ యుద్ధం..రేప‌టి వేళ ఎవ‌రు ఎంత‌టి స‌మ‌ర్థులో.. ఆచ‌ర‌ణలో ఎవ‌రు ముందుంటారో అన్న‌ది కాల‌మే తేలుస్తుంది. కానీ ఇప్పుడు రోడ్లు మాత్రం అంద‌విహీనంగా అస్త‌వ్య‌స్తంగా ఉన్నాయి..వీటి మ‌ర‌మ్మ‌తుల‌కు టైం ఇవ్వండి మాట‌లు త‌రువాత.. అన్న‌ది ప్ర‌జ‌ల విన్నపం.

రోడ్ల నిర్వహణ అన్నది ఏ ప్రభుత్వం ఉన్నా ఒకేలా ఉంటోంది అన్నది ఓ విమర్శ. హైవే మినహా గ్రామీణ రహదారుల సోయగం వర్ణించలేం కూడా.. పాపం పల్లె ప్రజలు ప్రాణం  అరచేతిలో ఉంచుకుని ప్రయాణం చేస్తున్న  ఘటనలు ఎన్నో.. ఇప్పుడు రహదారుల విషయమై నిర్వహణ పై బోలెడు మాటలు చెబుతున్న టీడీపీ అప్పుడు వాటిని ఏ మేరకు పట్టించుకుంది ముఖ్యంగా గ్రామీణ రహదారుల కోసం ఏం చేసింది అన్నది గణాంకాలతో సహా చెబుతోంది వైసీపీ.. తాము టీడీపీ కాలంలో చేపట్టిన పనుల్లో ఉన్న అవకతవకలను సరిదిద్దేందుకే ఈ రెండేళ్ల  కాలం సరిపోయిందని, ఆర్థిక భారం అంతగా ఉన్నా రోడ్ల నిర్వహణకు తమ ప్రాధాన్యం ఎన్నడూ తగ్గలేదని వైసీపీ చెబుతోంది. గ్రామీణ దారులు బాగుపడడం,గిరిజన తండాలు బాగుపడడం ఇష్టం లేకనే టీడీపీ మాట్లా డుతోంది అని వైసీపీ పెద్దల మాట.

 
రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వానలకు రహదారులు ఛిద్రం అవుతున్నాయి.. ఎక్కడికక్కడ నీరు నిలిచి ప్రయాణికుల సహనాన్ని పరీక్షిస్తున్నాయి.. రహదారుల మరమ్మతులు సకాలంలో చేపట్టకపోవడం వలనే ఈ దుఃస్థితి అని టీడీపీ అంటే ఇవి టీడీపీ గుంతలు అని వైసీపీ ఎద్దేవా  చేస్తుంది. మొత్తానికి రోడ్ల బాగు కోసం సీఎం నిధులు అయితే కేటాయించారని వాటికో మంచి రూపం  త్వరలోనే వస్తుందని అధికార యంత్రాంగం తాజాగా ప్రకటన జారీ చేసింది. మరి! ఆనాడు టీడీపీ చేసిందేంటి? ఇప్పుడు వైసీపీ చేయాలనుకుంటున్నది ఏంటి? ఇక శ్రీకాకుళంలాంటి వెనుకబడిన ప్రాంతాలలో ఎప్పటిలానే రోడ్లున్నాయని, కొత్త రోడ్ల పనులకు
శంకు స్థాపనలు అయితే జరిగాయి కానీ అవి వేగం పుంజుకోలేదని ప్రజాసంఘాలు చెబుతున్నాయి.. ఏ ప్రభుత్వం హయాంలో అయినా మరమ్మతులకు ప్రాధాన్యం తప్ప నాణ్యతకు  ప్రాధాన్యం లేకుండా పోతోందని వర్షాకాలంలో రోడ్ల నాణ్యత ఏంటన్నది తేలిపోవడం మినహా ఎవ్వరూ ఏం చేయలేని దుఃస్థితి ఉందని వారు ఆవేదన చెందుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: