ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభ వర్షాకాల సమావేశాలు ఎప్పుడా అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఇదే అంశంపై ఇప్పటికే ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు కూడా. శాసనసభ నిర్వహించాలని.. టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు కూడా. ఈ ఏడాది బడ్జెట్ సమావేశాలు కూడా కరోనా వైరస్ కారణంగా కేవలం ఒకరోజు మాత్రమే నిర్వహించారు. అదేమని అడిగితే... వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకే ఇలా అని ప్రభుత్వం ప్రకటించింది. బడ్జెట్ కేటాయింపులపై కనీస చర్చ కూడా లేకుండా వార్షిక బడ్జెట్‌ను ప్రభుత్వం ఆమోదించుకుంది. ఈ నిర్ణయం అప్పట్లో విమర్శలకు దారి తీసింది. తెలంగాణ ప్రభుత్వం కూడా బడ్జెట్ సమావేశాలను రెండు రోజుల పాటు నిర్వహించింది. కానీ జగన్ సర్కార్ మాత్రం ఒకరోజుతో సరిపెట్టేసింది. ఇప్పుడు వర్షాకాల సమావేశాలను ఎప్పుడు నిర్వహిస్తారని అంతా ఎదురుచూస్తున్నారు.

ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వర్షాకాల శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. పది రోజుల పాటు సభ నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు కూడా. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా సభా సమయానికి ఆసన్నమైందని అంతా భావిస్తున్నారు. అయితే వర్షాకాల సమావేశాలు మాత్రం వచ్చే నెలలో కూడా జరిగే అవకాశం కనిపించడం లేదు. వచ్చే నెలలో కొత్త మంత్రివర్గ కూర్పు ఉంటుందని అంతా భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన కసరత్తు కూడా ఇప్పటికే తుది దశకు చేరుకున్నట్లు సమాచారం. దసరా పండుగను మంత్రివర్గ విస్తరణకు ముహుర్తంగా అంతా భావిస్తున్నారు. దీంతో వచ్చే నెలాఖరు వరకు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం లేదు. కొత్త మంత్రివర్గం ఏర్పాటైన తర్వాత... వారిని శాసనసభకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్వయంగా పరిచయం చేస్తారని... అందుకే సభ నిర్వహణ ఇప్పట్లో ఉండే అవకాశం లేదంటున్నారు పార్టీ పెద్దలు. అయితే కొత్తగా బాధ్యతలు చేపట్టిన మంత్రులు... ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ప్రశ్నలకు ఏ విధంగా సమాధానమిస్తారో చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: