శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో తితిలీ తుపాను తాలూకా ప్రకంపనలు రేగాయి. తుపాను బాధితులకు సాయం అందించడంలో జగన్‌ ప్రభుత్వం అవలంబిస్తున్న అలసత్వ వైఖరి, పక్షపాత ధోరణిపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. మూడేళ్ల క్రితం ఉద్దానం ప్రాంతాన్ని అతలాకుతలం చేసిన తితిలీ తుపాను ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా రాజకీయాలను కుదిపేస్తోంది. తుపాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతాంగానికి అందాల్సిన పరిహారం విషయంలో వివాదం నెలకొంది. నాడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో గుర్తించిన లబ్ధిదారుల జాబితాలో ఉన్న బాధితులకు.. నేటి వైసీపీ సర్కారు పరిహారం అందించటం లేదు. దీంతో సర్వం కోల్పోయిన ఉద్దానం ప్రాంతంలోని తితిలీ తుపాను బాధితులకు నేటికీ న్యాయం జరగలేదు. ఇదే అంశం ఇప్పుడు పలాస నియోజకవర్గంలో అధికార ప్రతిపక్షాల మధ్య అగ్గి రాజేస్తోంది.

తితిలీ తుపాను ఈ మాయదారి తుపాను సిక్కోలు రైతన్నల తలరాతలను మార్చేసింది. మూడేళ్ల క్రితం రాత్రికి రాత్రి ఉద్దానంపై విరుచుకుపడిన తితిలీ తుపాను రైతన్నల జీవనగతిని ఛిద్రం చేసేసింది. పచ్చని కొబ్బరి, జీడి మామిడి తోటలు కుప్పకూలిపోయాయి. ఈ భారీ విపత్తు నుంచి తేరుకోవటం ఇక కష్టమే అనుకున్న ఉద్దానం రైతన్నలకు నాటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం బాసటగా నిలిచింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లోనే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు సుమారు నెల రోజుల పాటు మకాం వేసి ప్రజలకు అండగా నిలిచారు. నేనున్నాను అంటూ ఉద్దానం వాసుల్లో ధైర్యాన్ని నింపారు.

తెలుగుదేశం పార్టీ అధికారం కోల్సోయిన తర్వాత ఉద్దానం ప్రాంతంలోని తితిలీ తుపాను బాధితుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. నాటి పీడకల నేటికీ మరిచిపోలేకపోతున్న ఉద్దానం రైతన్నలకు ప్రస్తుత పాలకుల తీరు మరింత కుంగదీస్తోంది. తితిలీ పరిహారం నేటికీ అందకపోవటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇదే అంశం ఇప్పుడు పలాస నియోజకవర్గంలో అగ్గి రాజేస్తోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే తితిలీ బాధితులను ఆదుకుంటామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రగల్బాలు పలికిన వైసీపీ పెద్దలు.. ఇప్పుడు నోరు మెదపటం లేదు. దీంతో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ సహకారంతో ఉద్దానం రైతులు పరిహారం కోసం రోడ్డెక్కారు.

పార్టీలకు అతీతంగా అందించాల్సిన తితిలీ పరిహారం విషయంలోనూ అధికార పార్టీ రాజకీయం చేస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుల పేర్లను జాబితా నుంచి తప్పిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు, అప్పటి జిల్లా కలెక్టర్ ధనుంజయ్ రెడ్డిలు స్వయంగా క్షేత్రస్ధాయిలో పర్యటించి లబ్ధిదారుల జాబితాను రూపొందించారు. కానీ నాటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉండటమే ఉద్దానం రైతుల శాపం అన్నట్టు స్థానిక వైసీపీ ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తితిలీ తుపాను బాధితులకు న్యాయం జరిగే దాకా పోరాటం కొనసాగించడంపై టీడీపీ నేతలు దృష్టి సారించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: