దేశవ్యాప్తంగా కొవిడ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఒకటి రెండు రోజులు హెచ్చు తగ్గులున్నా కూడా.. నిలకడగా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కర్నాటకలో కూడా ఇదే పరిస్థితి. అయితే అక్కడి ప్రభుత్వం మాత్రం కొవిడ్ జాగ్రత్తల విషయంలో ఎందుకో ఉదాసీనంగా ఉన్నట్టు విమర్శలు వినపడుతున్నాయి. రోజువారీ కేసులు 50వేల వరకు వస్తున్నాయి. దీంతో ప్రజల్లో భయాందోళనలు పెరిగిపోతున్నాయి.

ఏపీలాంటి రాష్ట్రాల్లో రోజువారీ కేసుల సంఖ్య 10వేలకు చేరుకుంటేనే.. నైట్ కర్ఫ్యూతోపాటు, ఇతరత్రా ఆంక్షలు ఏపీలో కఠినంగా అమలులో ఉన్నాయి. మిగతా రాష్ట్రాల్లో కూడా అదే పరిస్థితి ఉంది. కానీ కర్నాటక మాత్రం ఆంక్షలు మినహాయిస్తూ ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుతం కర్నాటకలో వీకెండ్ కర్ఫ్యూని ఎత్తేశారు.

కర్నాటకలో ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య కూడా ఆమధ్య భారీగా పెరిగింది. ఉత్తరాదిలో ఒమిక్రాన్ జాడ ఉన్న సమయంలో కర్నాటకలో కూడా కేసుల సంఖ్య పెరిగింది. న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు పెద్దగా విధించలేదు. అయితే అప్పట్లో కొవిడ్ కేసులు సంఖ్య కూడా పెద్దగా లేదు. కానీ ఇప్పుడు మళ్లీ కేసుల సంఖ్య బాగా పెరిగిపోయింది. కేసులు పెరుగుతుంటే, ఆంక్షల స్థాయికూడా పెరగాలి. కానీ కర్నాటక ప్రభుత్వం మాత్రం వీకెండ్ కర్ఫ్యూని ఎత్తిసి విమర్శలు ఎదుర్కొంటోంది. ఇక్కడ ఏపీలో కూడా స్కూళ్ల నిర్వహణ విషయంలో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. కేసుల సంఖ్య పెరుగుతుంటే, స్కూళ్లను నిర్వహించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు విపక్షాల నేతలు. కానీ ప్రభుత్వం స్కూళ్ల నిర్వహణకే మొగ్గు చూపుతోంది. కేసుల సంఖ్య భారీగా పెరిగితే కచ్చితంగా కఠిన నిర్ణయం తీసుకుంటామంటోంది. అటు కర్నాటకలో మాత్రం కేసుల సంఖ్య పెరుగుతున్నా ప్రభుత్వం ఉదాసీనతతో ఉండటం విమర్శలకు తావిస్తోంది.


మరోవైపు అసెంబ్లీ ఎన్నికలు ఉన్న రాష్ట్రాల్లో ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. ప్రచార కార్యక్రమాలపై నిషేధాలు విధించారు. కేసుల సంఖ్య పెరగకుండా చూస్తున్నారు. అలాంటి హడావిడి ఏదీ లేకపోవడంతో కర్నాటకలో మాత్రం ఆంక్షల విషయంలో ప్రభుత్వం ఉదాసీనంగా ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: