పీఆర్సీ వివాదానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఊహించని మద్దతు దొరికింది. మొదటిదేమో హైకోర్టు రూపంలో అయితే రెండోదేమో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ రూపంలో దొరకటం గమనార్హం. హైకోర్టు విషయానికి వస్తే కొంతకాలంగా న్యాయవ్యవస్ధ-ప్రభుత్వం మధ్య ఎలాంటి సంబంధాలున్నాయో అందరికీ తెలిసిందే. చాలా కేసుల్లో పిటీషన్లు వేసిన చాలామందికి అనుకూలంగానే హైకోర్టు ఆదేశాలిచ్చింది.
ఇలాంటి నేపధ్యంలోనే పీఆర్సీ వివాదంపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా గెజిటెడ్ ఉద్యోగుల సంఘం కోర్టులో కేసు వేసింది. అయితే ఊహించని విధంగా పిటీషనర్ కు హైకోర్టు గట్టిగా తలంటిపోసింది. జీతాలు తగ్గించే అధికారం ప్రభుత్వానికి ఉందని కోర్టు స్పష్టంగా చెప్పేసింది. పీఆర్సీ వివాదంపై ప్రభుత్వాన్ని ఎలా బెదిరిస్తారంటు కోర్టు ఫుల్లుగా క్లాసు పీకింది. పీఆర్సీని సవాలు చేసే హక్కు ఉద్యోగులకు లేదని గట్టిగా చెప్పేసింది.  చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సిన విషయంపై సమ్మె ఎలా చేస్తారంటు నిలదీసింది. అసలు పిటీషన్ కు విచారణర్హతే లేదని తేల్చేసింది.
తాము వేసిన పిటీషన్ పై తమకే కోర్టు రివర్సులో  క్లాసు తీసుకుంటుందని అసోసియేషన్ నేతలు ఏమాత్రం ఊహించలేదు. గెజిటెడ్ అధికారుల పిటీషన్ పై కోర్టు స్పందించిన తీరు పీఆర్సీ సాధన సమితి నేతల వైఖరికి కూడా వర్తిస్తుందనే ప్రచారం మొదలైంది. సమ్మె చేయటం మంచిది కాదని సంప్రదింపుల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలని కోర్టు సూచించింది. ఇక ఉండవల్లి కూడా ఉద్యోగులకు ఒక బహిరంగ లేఖ రాశారు.
కొంతకాలంగా జగన్ ప్రభుత్వంపై ఉండవల్లి ఒంటికాలిమీద లేస్తున్న విషయం తెలిసిందే. అలాంటిది కరోనా వైరస్ నేపధ్యాన్ని, తగ్గిన రాష్ట్ర ఆదాయాన్ని ఉద్యోగనేతలు దృష్టి పెట్టుకోవాలన్నారు. జీతాలు పెంచమని అడిగిన వాళ్ళని చూశాము కానీ తగ్గించమని అడగటం చూడలేదన్నారు. సమ్మె చేయటం కన్నా చర్చల ద్వారానే వివాదాన్ని పరిష్కరించుకోవాలని సూచించారు. అంటే ఇటు కోర్టు నుండి అటు ఉండవల్లి నుండి జగన్ ప్రభుత్వానికి మద్దతు దొరికిందనే చెప్పుకోవాలి. ఈ నేపధ్యంలో ఉద్యోగులను, నేతలను రెచ్చగొడుతున్న ప్రతిపక్షాలు, ఎల్లోమీడియా ఏమి చేస్తాయో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: