ఇటీవలే అమ్మఒడి డబ్బులు లబ్ధిదారుల ఖాతాల్లో పడ్డాయి. వారం తిరిగే లోగా ఆర్టీసీ చార్జీలు పెరిగాయి. కరోనా తర్వాత ఇటీవలే ఆర్టీసీ చార్జీలు ఓసారి పెరిగాయి. ఇప్పుడు మళ్లీ వడ్డన మొదలైంది. డీజిల్ రేట్లు పెరుగుతున్నాయనే కారణంతో ఈసారి వడ్డింపు మొదలు పెట్టారు అధికారులు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో డిజీల్ సెస్ పేరుతో టికెట్ల రేట్లు పెంచింది ఆర్టీసీ. ఇప్పుడు మరోసారి విధిలేని పరిస్థితుల్లోనే డీజిల్ సెస్ మళ్లీ పెంచక తప్పడంలేదని చెబుతున్నారు అధికారులు. కిలోమీటర్ల ప్రాతిపదికన డీజిల్ సెస్, టికెట్ రేటు రూపంలో వసూలు చేస్తున్నారు. చార్జీల పెంపుతోపాటు విద్యార్థుల బస్ పాస్ చార్జీలు కూడా పెరిగాయి. బస్ పాస్ ఛార్జీలు దాదాపు 20 శాతం పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.

డీజిల్ రేట్లు పెరగడం, స్పేర్ పార్ట్స్, నిర్వహణ ఖర్చులు కూడా పెరగడంతో ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి డీజిల్ సెస్ పెంచక తప్పడం లేదంటున్నారు ఆర్టీసీ అధికారులు. పెరిగిన డీజిల్ ధరల కారణంగా రోజుకు రెండున్నర కోట్ల రూపాయల అదనపు భారం ఆర్టీసీపై పడుతోందని వివరణ ఇస్తున్నారు అధికారులు. ప్రజలు ఆర్టీసీ ఆర్ధిక పరిస్థితి అర్ధం చేసుకుని సహకరించాలని కోరారు. పెరిగిన ఆర్టీసీ ధరలు ఈరోజునుంచి అమలులోకి వస్తున్నాయి. ఈసారి కిలోమీటర్ల ప్రాతిపదికన సెస్ విధిస్తుండటంతో.. టిక్కెట్ రేట్లు భారీగా పెరిగే అవకాశమున్నట్టు తెలుస్తోంది. పల్లె వెలుగులో ప్రస్తుతం కనీస చార్జీ 10 రూపాయలు ఉంది. 30కిలోమీటర్ల వరకు దీన్ని పెంచరు కానీ, ఆ తర్వాత పల్లెవెలుగు చార్జీ కూడా పెరుగుతుంది. డీజిల్ సెస్ ఆడ్ అవుతుంది.

పల్లె వెలుగు బస్సుల్లో 60 నుంచి 70 కిలో మీటర్ల వరకు 10 రూపాయల మేర డీజిల్ సెస్ పెంచుతున్నారు. ఎక్స్‌ ప్రెస్, మెట్రో ఎక్స్‌ ప్రెస్‌, మెట్రో డీలక్స్ బస్సులలో ప్రస్తుతం ఒక టికెట్‌ పై 5 రూపాయల డీజిల్ సెస్ వసూలు చేస్తున్నారు అందులో కూడా 30 కిలోమీటర్ల వరకు రేట్లు పెంచరు. ఆ తర్వాత 65 కిలో మీటర్ల వరకు అదనంగా 5 రూపాయలు, 80 కిలోమీటర్ల వరకు అదనంగా 10 రూపాయలు వసూలు చేస్తారు. సిటీ బస్సుల్లో మాత్రం టికెట్ రేట్లు పెంచట్లేదని ప్రకటించారు అధికారులు. తిరుమల కొండకు వెళ్లే శ్రీవారి భక్తులపై కూడా ఆర్టీసీ వడ్డింపులు ప్రారంభించింది. తిరుమల-తిరుపతి మధ్య ఆర్టీసీ చార్జీలు భారీగా పెరిగాయి. 75 రూపాయలనుంచి 90 రూపాయలకు టికెట్ రేట్లు పెంచారు. రానుపోను ఛార్జీ 135 రూపాయలనుంచి 160 రూపాయలకు పెరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: