టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి, స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు ఈరోజు ఉదయం తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. హైదరాబాద్ లోని ఆయన నివాసంలో ఉన్న ఆయనకు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు హుటాహుటిన బసవతారకం ఆస్పత్రికి తరలించారు. వెంటిలేటర్ పై చికిత్సనందిస్తూండగా ఆయన కన్నుమూశారు. అయితే ఆయన అనుచరులు మాత్రం ఇటివల జరుగుతున్న రాజకీయ పరిణామాలకు కలతచెంది ఆత్మహత్యకు పాల్పడ్డారని అంటున్నారు. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.

 


 పల్నాడు ప్రాంతంలో తిరుగులేని నాయకుడిగా కోడెల శివప్రసాదరావు ఎదిగారు. టీడీపీ హయాంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా, స్పీకర్ గా ఆయన అనేక బాధ్యతలు నిర్వర్తించారు. నవ్యాంధ్రప్రదేశ్ తొలి స్పీకర్ గా పని చేశారు. వైద్య వృత్తిలో నరసారావుపేటలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. నరసారావుపేటలో ఆస్పత్రి కూడా ప్రారంభించి ఆయన హస్తవాసి మంచిదని పేరు తెచ్చుకున్నారు. 1983లో టీడీపీ ఆవిర్భావంతో రాజకీయాల్లోకి వచ్చారు. ఎన్టీఆర్ పిలుపు మేరకు ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. 1983 నుంచి వరుసగా నరసారావుపేట నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో సత్తెనపల్లి నుంచి ఎమ్మెల్యేగా పొటీ చేసి గెలుపొందారు. వైద్యునిగా తెచ్చుకున్న పేరు ఆయనకు రాజకీయాల్లో రాణించడానికి దోహదపడింది. పల్నాడులో అప్పటివరకూ ఉన్న ఫ్యాక్షన్ మూలాల్ని కోడెల కొంతవరకూ రూపుమాపగలిగారు.

 


నియోజకవర్గంలో వైద్యం కొనసాగిస్తూనే రాజకీయాల్లోకి వచ్చిన ఆయన ఎన్నో సమస్యలను పరిష్కరించారు. పల్నాడులోని కోటప్ప కేంద్రాన్ని ఎంతో ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దటంలో తన వంతు కృషి చేశారు. హోంమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి, పర్యాటక శాఖ మంత్రిగా, స్పీకర్ గా కూడా పనిచేశారు. నియోజకవర్గంలో అవయువదానం చేయడంలో ప్రజలను చైతన్యవంతం చేయడంలో ఆయన సఫలీకృతులయ్యారు. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో ఆయన ఒక డైరక్టర్ గా కూడా ఉన్నారు. ఆయన మృతి టీడీపీకి తీరని లోటు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: