తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడలో పట్టణ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్ర‌య‌త్నిస్తుండ‌గా....నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి క్రితం కూలిపోయింది. వేములవాడ మూలవాగుపై నిర్మాణంలో ఉన్న రెండవ బ్రిడ్జి అక‌స్మాత్తుగా కుప్ప‌కూలింది. గత మూడు రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలకు వేములవాడ మూలవాగు పొంగిపొర్లుతోంది. వరద ప్రవాహం ధాటికి రూ.22 కోట్లతో నూతనంగా హైలెవల్ బ్రిడ్జికి సంబంధించిన రెండు పిల్లర్లు విరిగాయి. చాలా రోజులుగా బ్రిడ్జి పనులు నత్తనడకన సాగుతుండ‌గా...ఈ ప‌రిణామం చోటు చేసుకోవ‌డం సంచ‌ల‌న‌గా మారింది. 


ప్రభుత్వం రూ.28 కోట్లతో వేములవాడలోని మూలవాగుపై బ్రిడ్జి పనులు చేపట్టింది. అయితే, గత నాలుగేళ్లగా బ్రిడ్జి నిర్మాణం పనులు జరుగుతున్నాయి. రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలలో మూల వాగు పొంగింది. దీని ప్రవాహం ఎక్కువగా ఉండడంతో బ్రిడ్జి కింద పెట్టిన సపోర్టు ఓరిగిపోయింది. దీంతో బ్రిడ్జి మధ్యలోకి కుంగి.. కాంక్రీటు, ఇనుప కడ్డీలు దెబ్బతిన్నాయి. పనులు మధ్యలో ఉండగానే నీటి ప్రవాహం పెరగడంతో బ్రిడ్జి కూలిపోయింది. కాగా, నాసిరకం పనుల కారణంగానే బ్రిడ్జి కూలిందని...కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.


ఇదిలాఉండ‌గా, గ‌త ఏడాది మంత్రి కేటీఆర్ న‌గ‌ర అభివృద్ధి విష‌యంలో కీల‌క సూచ‌న‌లు చేశారు. పట్టణంలో చేపట్టే సివిల్‌ పనుల (భవనాలు, బ్రిడ్జీలు, రోడ్లు)లో చోళ–చాళుక్య శిల్ప కళా వైభవం ఉట్టిపడేలా చూడాలని అధికారులకు సూచించారు. ప్రణాళికాబద్ధంగా, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని వేములవాడ పట్టణ మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేయాలని ఆదేశించారు. పట్టణంలో ప్రవేశించగానే ఒక ఆలయ ప్రాంతానికి వచ్చామనే భావన కలిగేలా.. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని, అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని చెప్పారు. ముఖ్యంగా విస్తరించనున్న రోడ్లు, పారిశుద్ధ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని.. గుడి చెరువులోకి మురికినీరు రాకుండా డ్రైనేజీలు ఏర్పాటు చేయాలని సూచించారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న బస్టాండ్‌ నుంచి దేవాలయం వరకు కేబుల్‌ కారు ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలని కేటీఆర్‌ ఆదేశించారు. పట్టణంలో భక్తుల సౌకర్యార్థం ఉచితంగా బస్సులు, అందులోనూ వీలైతే ఎలక్ట్రిక్‌ బస్సులు ఏర్పాటు చేయాలని చెప్పారు. త్వరలో వేములవాడలో పర్యటించి.. పనులను క్షేత్రస్థాయితో పరిశీలిస్తామన్నారు. అయితే, మంత్రి చెప్పింది ఒకటి...వాస్త‌వంగా జ‌రిగింది మ‌రొక‌టి అని చ‌ర్చ జ‌రుగుతోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: