దసరా అంటే సరదాల పండగ. ఊళ్లన్నీ కొత్త కొత్త ఆచారాలతో సందడి చేస్తుంటాయి. గంగిరెద్దుల మేళం, బొమ్మల కొలువు,ఇలా అంతా దసరా హడావుడే. ఇక ముఖ్యంగా చెప్పుకోవలసినవి దసరావేషాలు. వీటినే పగటివేషాలు అంటారు. వీటి ముఖ్య ఉద్దేశం ప్రజా వినోదం. ఆయా ప్రాంతాల ప్రజల ఆశలు, ఆశయాలకు ప్రతిబింబంగా ఇవి మనదేశంలో బహుళ ప్రచారం పొందాయి.


ఇకపోతే ప్రజల సమస్యలను నాటి పరిపాలకుల దృష్టికి తీసుకురావడం, వర్తమానాలను చేరవేయడం కోసం ప్రధానంగా ఈ ప్రదర్శనలు ప్రచారంలోకి వచ్చాయని ప్రతీతి. ఇందులో  పౌరాణికమైనవి, కల్పిత వేషాలు, హాస్య పాత్రలు ఉంటాయి. ఇక ఈ కళలు శాతవాహనుల కాలం నుంచే ఉందని హాలుని గాథాసప్తశతి ద్వారా తెలుస్తోంది. మారువేషాలు ధరించి గూఢచారులుగా వీరు సమాచారాన్ని అందించేవారని, కాకతీయుల యుగంలో యుగంధరుడు పిచ్చివానిగా నటించి ఢిల్లీ సుల్తానులను జయించాడని చరిత్ర చెబుతోంది.


ఈ కాలంలో వీటికి ఆదరణ తగ్గడంతో చాలా కళలు భిక్షుక వృత్తిగా మారిపోయాయి. పగటివేషాలు వేసేవారు ముఖ్యంగా దసరా పండుగ సమయంలోనే వేషాలు వేయడం వలన ఇవి దసరా వేషాలుగా ప్రసిద్ధికెక్కాయి. వీరు సంచారజీవనం చేస్తూ ప్రదర్శనలిస్తూంటారు. అందుకే వీళ్లని బహురూపులు అని కూడా అంటారు..ఇవేకాక దసరా పోలీసులు, పిట్టలు దొరలు కూడా ప్రత్యేకంగా వస్తారు. వారు తడబాటు లేకుండా నిరాఘాటంగా పదేసి నిముషాలు చెప్పే కబుర్లు నవ్వు తెప్పిస్తాయి. ఒకప్పుడు దాదాపుగా 64 రకాల వేషాలు వేస్తే, ఇప్పుడు 32 వేషాలు మాత్రమే వేస్తున్నారు.


అందులో ఆదిబైరాగి, చాత్తాద వైష్ణవం, కొమ్ముదాసరి, హరిదాసు, ఫకీరు, సాహెబు, బుడబుక్కలవాడు, సోమయాజులు – సోమిదేవమ్మ, వీరబాహు, గొల్లబోయిడు, కోయవాడు, దేవరశెట్టి, ఎరుకలసోది, జంగం దేవర, గంగిరెద్దులు, పాములవాడు, పిట్టలదొర, చిట్టిపంతులు, కాశీ కావిళ్లు..మొదలైన ఎన్నో వేషాలు ఇప్పటికి అక్కడక్కడ వేస్తున్నారు. వీటిలో కొన్ని సంభాషణలకు ప్రాధాన్యత ఉన్నవైతే, మరి కొన్నింటిలో, పద్యాలకు, అడుగులకు, వాద్యాలకు ప్రాధాన్యత ఉంటుంది. ఇదే అసలైన సిసలైన దసరా పండగంటే కానీ ఈ కాలంలో చాలా చోట్ల ఈ హడావుడి కనిపించడం లేదు. పండగంటే తాగడం,తినడం వరకే అని భావిస్తున్నారు. ఇక ముందు ముందు కాలంలో ఈ పండగల గురించి చెబితే విని ఆనందించే పరిస్దితి వస్తుందేమో...

మరింత సమాచారం తెలుసుకోండి: