బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ లో భాగంగా జరిగిన సిరీస్ లో భారత్ ఘన విజయం సాధించింది. తమ సొంతగడ్డపై తిరుగే లేని ప్రత్యర్థిని మట్టి కరిపించి చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. టీమిండియా లో కీలక ఆటగాళ్లు అందరూ గాయాల బారిన పడుతూ జట్టుకు దూరం అవుతున్న సందర్భంలో కుర్రాళ్ళు ముందుండి నడిపించి భారత్ ఘన విజయాన్ని కట్టబెట్టారు. నాలుగు టెస్టుల ఈ సిరీస్ మొదటి నుండి ఆసక్తికరంగానే నడిచింది. మొదటి టెస్టులో ప్రత్యర్థి ఆసీస్ చేతిలో టీమిండియా ఘోరమైన ఓటమిని చవిచూసింది. ఇక రెండవ టెస్టులో ప్రత్యర్థిని మట్టి కరిపించి విజయం సాధించింది.

సిడ్నీలో జరిగిన మూడవ టెస్టులో ఇరు జట్లు కూడా మంచి ప్రదర్శనతో డ్రాగా ముగిశాయి. ఇక బ్రిస్బేన్ లో జరిగిన చివరి టెస్టులో గెలుపు ఇరు జట్లకు కూడా దోబూచులాడుతుంది. అయితే ఎట్టకేలకు టీమిండియా యువ సంచలనం రిషబ్ పంత్ చెలరేగడంతో గబ్బా వేదికలో తిరుగులేని ఆసీస్ జట్టుకు షాక్ ఇచ్చి టీమ్‌ఇండియా విజయం సాధించింది. ఇదిలా ఉండగా రిషబ్ పంత్ చివరి టెస్ట్ మ్యాచ్ తో మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీకి చెందిన ఓ రికార్డును బద్దలుకొట్టాడు.

టెస్టుల్లో భారత వికెట్‌ కీపర్‌గా అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో వెయ్యి పరుగులు సాధించిన ఆటగాడిగా కొత్త రికార్డు నెలకొల్పాడు. ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ అజింక్య రహానె 24 పరుగుల వద్ద ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన పంత్‌ (89*).. కమిన్స్‌ వేసిన 58 వ ఓవర్ లో వెయ్యి పరుగుల మైలురాయి చేరుకున్నాడు. అతడికిది 27వ ఇన్నింగ్స్‌ కావడం విశేషం. అంతకుముందు ధోనీ 32 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని అందుకున్నాడు. పంత్‌ ఇప్పుడు దాన్ని అధిగమించాడు. ఇక తర్వాతి స్థానాల్లో ఫరూక్‌ ఇంజినీర్‌ (36), వృద్ధిమాన్‌ సాహా (37), నయన్‌ మోంగియా (39) ఉన్నారు. ఇక చివరి టెస్టులో రిషబ్ పంత్ 138 బంతులలో 89 పరుగులు సాధించి టీమిండియా గెలుపులో కీలకపాత్ర వహించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: