డ్రోన్ దాడులు.. ఇప్పుడు టెక్నాలజీ తెచ్చిన మరో చిక్కు సమస్య. అందివచ్చిన టెక్నాలజీని వినాశనానికి వినియోగిస్తే ఎలా ఉంటుందో ఈ డ్రోన్లను చూస్తే తెలుస్తుంది. మనిషి వెళ్లకుండానే పని చక్కబెట్టే అద్భుత టెక్నాలజీ డ్రోన్లు.. ఈ డ్రోన్లను మందుల సరఫరా... పొలాల్లో పురుగుమందుల పిచికారీ.. కొండకోనల పరిశోధన.. ఇలా ఎన్నో రంగాలలో వాడుతున్నారు. అయితే ఇదే టెక్నాలజీ ఇప్పుడు టెర్రరిస్టులకూ వరంగా మారింది. ఇటీవల జమ్ము వాయుసేన స్థావరంపై డ్రోన్ల దాడి కలకలం రేపింది.


కలుచక్‌లోని సైనిక స్థావరం వద్ద డ్రోన్ల సంచారంతో మన భారత భద్రతాదళాలు కూడా అప్రమత్తం అయ్యాయి. శత్రువులు కనిపించకుండా చేసే డ్రోన్‌ దాడులను అడ్డుకోవటం భద్రతా దళాలకు సవాల్‌గా మారింది. డ్రోన్లను వేటాడటం ప్రభుత్వానికి చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం. వేల రూపాయలతో తయారయ్యే డ్రోన్‌ను కూల్చేందుకు.. లక్షలు, కోట్ల రూపాయల విలువైన ఆయుధాలను వాడాల్సి ఉంటుంది. అందుకే ఇలాంటి డ్రోన్ల దాడులను అరికట్టే టెక్నాలజీ కోసం సైన్యం ప్రయత్నిస్తోంది. అయితే తక్కువ ఖర్చుకే ఈ టెక్నాలజీ అందిస్తానంటోంది హైదరాబాద్‌ స్టార్టప్‌ కంపెనీ.


హైదరాబాద్‌కు చెందిన గ్రీన్‌ రొబోటిక్స్‌ స్టార్టప్‌ కంపెనీ ఇంద్రజాల్‌  పేరిట యాంటీ డ్రోన్‌ వ్యవస్థను అభివృద్ధి చేసింది. సైబర్‌ సెక్యూరిటీ, రోబోటిక్స్‌, కృత్రిమ మేధకు సంబంధించిన అత్యాధునిక సాంకేతికతను కలిపి ఈ ఇంద్రజాల్ యాంటీడ్రోన్‌ రక్షణ వ్యవస్థను రూపొందించారు. ఇందులో వేర్వేరుప్రాంతాల్లో సెన్సర్లు, రాడార్లు అమరుస్తారు. ఇవన్నీ కృత్రిమ మేధపైనే ఆధారపడి పనిచేస్తాయి. ఈ ఇంద్రజాల్‌ యాంటీ డ్రోన్‌ రక్షణ వ్యవస్థ శత్రు డ్రోన్లను గుర్తించటంతోపాటు ట్రాకింగ్‌ కూడా చేస్తుంది.


అంతే కాదు.. ఆయుధాలతో శత్రుడ్రోన్లను కూల్చివేస్తుంది. ఈ ఇంద్రజాల్‌లో భాగంగానే కౌంటర్‌ డ్రోన్లు కూడా ఉంటాయట. ప్రత్యేకమైన ఆయుధాలేమీ సమకూర్చుకోకుండానే  సైనిక వ్యవస్థలో ఉండే ఆయుధాలతోనే శత్రు డ్రోన్లపై దాడి చేసేలా ఏర్పాట్లు చేస్తారు. ఇంద్రజాల్‌ రక్షణ వ్యవస్థ సైనిక స్థావరాలకే కాదు నగరాలు, రాయబార కార్యాలయాల రక్షణ, రాష్ట్రపతి భద్రత.. ఇలా ఉగ్రవాదుల దాడుల ముప్పు ఉన్న అన్నింటికి ఉపయోగపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: