గోవాలో మళ్లీ ఆక్సిజన్ అందక పదిహేను మంది మరణించడం దురదృష్టకరం. గోవా మెడిక‌ల్ కాలేజీ ఆసుప‌త్రిలో గురువారం ఉద‌యం మ‌రో 15 మంది క‌రోనా రోగులు మ‌ర‌ణించారు. మంగ‌ళ‌వారం ఆక్సిజ‌న్ కొర‌త‌తో 26 మంది క‌రోనా రోగులు చ‌నిపోయారు. ఇది జ‌రిగి రెండు రోజులు కాక‌ముందే గురువారం ఉద‌యం 2 గంట‌ల నుంచి ఆరు గంట‌ల మ‌ధ్య 15 మంది క‌రోనా రోగులు మ‌ర‌ణించారు. పెద్ద ఆక్సిజన్‌ సిలింండర్‌కు అనేక చిన్న సిలిండర్లను కలపడంలో తలెత్తిన లోపాల వల్లే వీరిలో కొందరు చనిపోయిన భావిస్తున్నామని రాష్ట్ర అధికారులు బాంబే హైకోర్టు గోవా ధర్మాసనానికి తెలిపారు. అర్ధరాత్రి 2 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య వీరు తుదిశ్వాస విడిచారని తెలిపారు. జీఎంసీహెచ్‌లో చికిత్స పొందే కోవిడ్‌ బాధితులకు అవసరమైన ఆక్సిజన్‌ను సక్రమంగా అందించాలని తాము ఉత్తర్వులిచ్చిన తర్వాత కూడా ఇలాంటి విషాదం సంభవించడంపై ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రాను ప్ర‌భుత్వం మెరుగు ప‌ర‌చ‌లేద‌న్న విష‌యం అర్థ‌మ‌వుతున్న‌ద‌ని విమ‌ర్శించింది. అన్నింటిని ప‌క్క‌న పెట్టి క‌నీసం ఒక రాత్రి అయినా ఆక్సిజ‌న్ కొర‌త వ‌ల్ల క‌రోనా రోగులు చ‌నిపోకుండా చూడాల‌ని న్యాయమూర్తులు ఎంఎస్ సోనాక్, నితిన్ జాంబ్రేతో కూడిన ధ‌ర్మాస‌నం సీఎం ప్ర‌మోద్ సావంత్ ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: