నేరాల‌కు అంతులేదు.. దానికి అనుబంధంగా జ‌రిగే ఘోరాల‌కు కూడా అంతే. అంతూ పొంతూ లేని ఈ నేరాల‌కు అడ్డుక‌ట్ట వేయాలంటే స‌మాజంలో ఆరోగ్య‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం నెల‌కొన‌డ‌మొక్క‌టేన‌ని అంద‌రి న‌మ్మ‌కం. కానీ అది ఎప్పుడ‌నేదానికి ఎవ‌రి ద‌గ్గ‌రా స‌మాధానం లేదు. ప్ర‌జ‌ల బ‌ల‌హీన‌త‌లను ఆస‌రాగా చేసుకొని అమాయ‌కుల‌కు కుచ్చ‌టోపీ పెడుతున్న నేరగాళ్లు రోజురోజుకూ పెచ్చ‌రిల్లిపోతున్నారు. తాజాగా ఈ కోవ‌లేకే అచ్చిరెడ్డి అనే వ్య‌క్తి వ‌చ్చిచేరాడు. విజ‌య‌వాడ‌కు చెందిన ఇత‌ను ఉద్యోగాలు, జ్యోతిష్యం పేరుతో ప్రజలను మోసం చేస్తున్న‌ట్లు తెలిసింది. చివ‌రికి న‌ల్గొండ పోలీసుల‌కు చిక్కాడు. తెలుగు రాష్ట్రాల్లో అతడు చాలామందిని మోసం చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మిస్తూ అమాయక ప్రజల నుంచి రూ.లక్షల్లో దండుకుంటున్న ఘరానా మోసగాడిని నల్గొండ పోలీసులు ఎట్టకేలకు ప‌ట్టుకున్నారు.  ఉద్యోగం ఇప్పిస్తామని డబ్బులు తీసుకొని మోసం చేశాడని న‌ల్గొండ హనుమాన్‌నగర్‌కు చెందిన సమ్మినేని సాయి అనే వ్యక్తి ఫిర్యాదుతో ఇవ్వ‌డంతో పోలీసులు విజయవాడ భవానీపురంకు చెందిన కోనాల అచ్చిరెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేప‌ట్ట‌గా ఆస‌క్తిక‌ర విష‌యాల‌కు బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

ఖమ్మం జిల్లాకు చెందిన ఓ మహిళకు సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో వాటా ఇప్పిస్తానని న‌మ్మించి అచ్చిరెడ్డి రూ.50లక్షలు తీసుకుని మొహం చాటేశాడు. దీనికి సంబంధించి ఖమ్మం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్లో గతేడాది కేసు నమోదైంది. ఖమ్మం పట్టణానికి చెందిన మరో మహిళకు రైల్వేలో అసిస్టెంట్‌ ఇంజనీరింగ్‌ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి రూ.20లక్షలు దోచుకున్నాడు. దీనికి సంబంధించి బాధితురాలి ఫిర్యాదుతో విజయవాడ భవానీపురం పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.

విజయవాడకు చెందిన ఓ యువతికి ఓ ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ టీవీలో యాంకర్‌గా అవకాశం ఇప్పిస్తానని నమ్మించిన అచ్చిరెడ్డి ఆమె నుంచి పలు విడతలుగా రూ.25లక్షల వరకు దోచుకున్నాడు. ఉద్యోగం గురించి ఎన్నిసార్లు ప్రశ్నించినా దాటవేస్తూ వచ్చాడు. చివరికి ఆమె నుంచి తప్పించుకు తిరుగుతూ ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చీటింగ్ కేసు నమోదు చేశారు. అలాగే నల్లగొండలో జ్యోతిష్యం పేరిట మరో వ్యక్తి దగ్గర రూ.4లక్షలు తీసుకొని మోసం చేసిన‌ట్లు కేసు న‌మోదైంది. దీంతో అచ్చిరెడ్డిపై తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని కేసులున్నాయన్న దానిపై పోలీసులు ఇప్పుడు ద‌ర్యాప్తు చేస్తున్నారు.  ఉద్యోగం, జ్యోతిషం పేరిట అచ్చిరెడ్డి చేతిలో ఇంకెవరైనా మోసపోతే తమకు ఫిర్యాదు చేయాలని న‌ల్గొండ పోలీసులు కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: