ఏపీ సీఎం జగన్ త్వరలోనే మాజీ ముఖ్యమంత్రి కాబోతున్నారా.. ముఖ్యమంత్రి కావాలని ఎంతగానో తపించిన జగన్.. మూడేళ్లు కూడా తన పదవీకాలం పూర్తి చేసుకోకుండానే మాజీ ముఖ్యమంత్రి అనిపించుకోబోతున్నారా.. ఇప్పుడు కొందరు రాజకీయ నాయకులు ఇదే చెబుతున్నారు. జగన్ త్వరలోనే జైలుకు వెళ్లడం ఖాయం అని కుండబద్దలు కొడుతున్నారు. అయితే జగన్ జైలుకు వెళ్తారన్న ప్రచారం ఇప్పటిదేమీ కాదు.. ఇది బాగా అరిగిపోయిన రికార్డే.


జగన్ అంటే గిట్టని నాయకులు, మీడియా కొంత కాలంగా ఈ ప్రచారం బాగానే సాగిస్తున్నారు. ఇదిగో జగన్ జైలుకు వెళ్తున్నారు.. అదిగో వెళ్తున్నారు.. అంటూ ఊదరగొడుతున్నారు. చంద్రజ్యోతిగా పేరున్న ఓ పత్రిక అయితే ఏకంగా సీఎం సీటు కోసం జగన్ ఇంట్లో గొడవలే జరుగుతున్నాయని.. జగన్ జైలుకు వెళ్తే ఎవరు సీఎం కావాలన్న అంశంపై జగన్ ఇంట్లో రచ్చ రచ్చ అవుతోందని కొన్నాళ్లు వరుసగా రాసుకొచ్చారు.


మరి ఇప్పుడు ఈ ప్రచారం మళ్లీ ఎందుకు తెరపైకి వచ్చింది.. ఇందుకు కారణంగా ఒకరు రఘురామ కృష్ణంరాజు.. ఆయన జగన్ బెయిల్ రద్దు చేయాలని కోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే. జగన్ తన పదవిని అడ్డుపెట్టుకుని సాక్షులను ప్రభావితం చేస్తున్నారన్నది రఘురామ కృష్ణంరాజు చెబుతున్న మాట. వీటితో పాటు అనేక వాదనలు ఆయన వినిపిస్తున్నారు. ఇప్పుడు ఈ కేసులో విచారణ కూడా పూర్తయింది.. ఇక వెలువడాల్సింది తీర్పే. ఆగస్టు 25న తీర్పు ఇస్తామని సీబీఐ కోర్టు ఇప్పటికే తెలిపింది.


అంటే ఈ 25న జగన్ జైలుకు వెళ్తారా.. లేదా అన్న విషయం తేలిపోతుంది. అయితే జగన్ బెయిల్ తప్పకుండా రద్దవుతుందని ఆయన జైలుకు వెళ్లడం ఖాయమని తాజాగా కాంగ్రెస్ నేత చింతా మోహన్ కూడా అంటున్నారు. మరి వీరిందరికీ ఏమైనా ముందస్తు సమాచారం ఉందా.. లేక గాల్లో తుపాకీ కాలుస్తున్నారా అన్న విషయం ఆగస్టు 25న కానీ తెలియదు. అప్పటి వరకూ ఈ సస్పెన్స్ తప్పదు.


మరింత సమాచారం తెలుసుకోండి: