ప్రాంతీయ పార్టీల‌ు చాలా వరకూ కుటుంబ పెత్తనాలే సాగుతుంటాయి. ఇలాంటి పార్టీల్లో నాయకుడు చాలా బలంగా ఉంటాడు. అధ్యక్షుడి చేతిలోనే సర్వాధికారాలు ఉంటాయి. అయితే.. అధ్యక్షుడు ఏమరుపాటుగా లేకపోతే మాత్రం.. మొన్న శివసేన పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రేకు జరిగినట్టు వెన్నుపోటు తప్పదు.. ఏక్‌నాథ్ షిందే అనే అనామకుడు ఏకంగా పార్టీనే హైజాక్  చేసి.. బీజేపీ మద్ధతుతో ఏకంగా సీఎం అయ్యాడు.


ఇప్పుడు ఈ పరిణామం తర్వాత ప్రాంతీయ పార్టీలు అప్రమత్తం అవుతున్నాయి. అంతేకాదు.. మహారాష్ట్ర తరహా సీన్ ఎక్కడ రిపీట్ అవుతుందో అన్న ఆసక్తికరమైన చర్చలు కూడా పొలిటికల్ సర్కిళ్లో జరుగుతున్నాయి. ఇప్పుడు తెలంగాణ బీజేపీ నేతలు కూడా అదే స్థాయిలో విమర్శిస్తున్నారు. టీఆర్ఎస్ లో ఏదో అలజడి జరుగుతోందని అనుమానం వ్యక్తం చేసిన బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. -కేసీఆర్ పార్టీలో ఏక్ నాథ్ షిండేలు చాలా మంది ఉన్నారని కామెంట్ చేయడం ఆసక్తి రేపుతోంది.


కేసీఆర్ అల్లుడు, కొడుకు, బిడ్డల్లో ఎవరైనా ఏక్ నాథ్ షిండేలు కావొచ్చంటున్నారు బండి సంజయ్. గతంలో హరీశ్ రావును కేసీఆర్ కొన్నాళ్లు దూరం పెట్టారు. మంత్రి పదవి కూడా ఇవ్వకుండా అవమానించారు. అప్పుడు హరీశ్ రావు.. బీజేపీలోకి వెళ్తాడని అంతా ఊహించారు. ఆమేరకు పుకార్లు బాగా షికారు చేశాయి. కానీ హరీశ్ రావు మాత్రం.. కేసీఆర్‌ బతికున్నంత వరకూ ఆయన మాటకు ఎదురు చెప్పేది లేదని చాలా ఇంటర్వ్యూల్లో చెప్పారు. తనకన్నా జూనియర్ అయినా కేటీఆర్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చినప్పుడు కూడా హరీశ్ పార్టీ వదులుతాడని పుకార్లు వచ్చాయి.


కానీ హరీశ్ రావు మాత్రం.. ఓపికగా మంచి కాలం కోసం ఎదురు చూశారు. మళ్లీ ఇప్పుడు హరీశ్ రావును కేసీఆర్ దగ్గరకు తీశారు. పార్టీలో కీలకమైన పాత్ర ఇస్తున్నారు. ఇలాంటి సమయంలో టీఆర్ఎస్‌లో ఏక్‌నాథ్ షిండే వంటి నేతలు తయారయ్యే అవకాశం ఉందా అన్న చర్చ మొదలైంది. కానీ.. ఏమో.. రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు కదా... ఎవరు చెప్పగలరు ఏం జరుగుతుందో?


మరింత సమాచారం తెలుసుకోండి: