ఈటల రాజేందర్‌ భవిష్యత్‌ వ్యూహం ఏమై ఉంటుంది.. కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతున్న చర్చ ఇది. ఈటలను కేసీఆర్ టార్గెట్ చేసి మరీ బలవంతంగా బయటకు పంపించాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే మంత్రి వర్గం నుంచి గెంటేశారు. ఇప్పుడు ఈటల దారేది.. ఈ ప్రశ్నకు ఇంకా సమాధానం లభించడం లేదు. మొదట్లో కార్యకర్తలతో మాట్లాడిన వ్యూహం ప్రకటిస్తా అన్నాడు ఈటల రాజేందర్‌. అన్నట్టుగా కార్యకర్తలతో మాట్లాడి హైదరాబాద్‌కు వచ్చాడు. అయినా వ్యూహం ప్రకటించలేదు.

ఈటలను మంత్రివర్గం నుంచి పంపించగానే.. ఆయన ముందు మూడు, నాలుగు ఆప్షన్స్ మిగిలాయి. ఒకటి కాంగ్రెస్‌లో చేరడం. రెండోది బీజేపీలో చేరడం.. మూడోది సొంత పార్టీ పెట్టుకోవడం.. నాలుగోది కేసీఆర్‌తోనే రాజీ కుదుర్చుకుని టీఆర్ఎస్‌లో కొనసాగడం. ఎక్కువ మంది ఈటల సొంత పార్టీ పెట్టుకుంటాడని భావించారు. అలా చేయడం ద్వారా ముందు ముందు ఈటల అసలైన తెలంగాణవాదానికి ప్రతీకగా మారతారని.. టీఆర్ఎస్‌లోని అసంతృప్తులు ఈటలతో జతకడతారని భావించారు. ముందు ముందు ఈటల సమర్థంగా వ్యవహరిస్తే.. ఆయనపై నాయకులకు గురి కుదిరితే ఏకంగా కేసీఆర్ నే ఈటల ఢీకొట్టే స్థాయికి వెళ్లొచ్చని కూడా అంచనాలు వేశారు.

అయితే రోజులు గడుస్తున్న కొద్దీ ఈటల చర్యలు మాత్రం విశ్లేషకులకు సైతం అంతుబట్టడం లేదు. సొంత పార్టీపై ఇంకా స్పష్టత ఇవ్వని ఈటల ఇప్పుడు వివిధ పార్టీల నేతలతో భేటీకావడం మరింత కన్‌ఫ్యూజ్ క్రియేట్ చేస్తోంది. మంగళవారం సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో ఈటల భేటీ అయ్యారు. అంతకు ముందు ఎంపీ డి శ్రీనివాస్‌ తోనూ ఆయన కుటుంబ సభ్యులతోను కలిసి రహస్య చర్చలు చేశారు. ఈటల బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతో కూడా సమావేశమయ్యారు.

ఈ వరుస భేటీలతో ఈటల ఫ్యూచర్‌ స్టెప్ ఏంటన్నది అర్థం కాకుండా ఉంది. టీఆర్ఎస్ కి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, హుజురాబాద్ నుంచి ఇండిపెండెంట్ గా ఈటల బరిలోకి దిగే అవకాశం ఉంది. అందులో భాగంగానే రాజేందర్ అన్ని పార్టీల నేతలతో కలుస్తున్నారని చెబుతున్నారు. ఇండిపెండెంట్ గా పోటీ చేసి.. టీఆర్ఎస్‌ను మట్టికరిపించాలని ఈటల నిర్ణయించుకున్నారని సమాచారం. మరి అసలు ఈటల వ్యూహం ఏంటో ముందు ముందుగాని ఓ స్పష్టత వచ్చే అవకాశం కనిపించడం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: