నాటికీ నేటికీ మరపురాని కుటుంబ కథా చిత్రాల్లో ‘గుండమ్మ కథ’ పేరు కచ్చితంగా ఉంటుంది. తెలుగు చిత్ర సీమలోని అగ్ర నటీనటులు కలిసి నటించిన ఈ సినిమా అప్పట్లో ప్రేక్షకులను విశేషయంగా అలరించింది. పాతళభైరవి, మాయాబజార్, మిస్సమ్మ వంటి అద్భుత చిత్రాలను తెరకెక్కించిన విజయా సంస్థ వారు చేసిన మొట్టమొదటి రీమేక్ చిత్రం ‘గుండమ్మ కథ’. జానపద బ్రహ్మ విఠలాచార్య దర్వకత్వంలో రూపొందిన ‘మనేతుమ్మెద హెట్టు’ అనే కన్నడ సినిమా ‘గుండమ్మ కథ’కు మూలం. ఈ సినిమా చేసే సమయంలో నాగిరెడ్డి వద్దనుంచి ఆర్థిక సహాయం అందుకున్న విఠలాచార్య ఈ సినిమా రీమేక్ హక్కులను నాగిరెడ్డికి ఇచ్చారు.
 ఆ తరువాత నాగిరెడ్డి తెలుగులో ఓ సినిమాను చేయాలని అనుకోవడంతో విఠలాచార్య సినిమాను రీమేక్‌ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ సినిమా నుంచి గుండమ్మ, ఆమె సవతి కూతురు, ఆమె కూతురు పాత్రను మాత్రమే కన్నడ సినిమా నుంచి తీసుకున్నారు, మిగిలిన అన్ని పాత్రలను సృష్టించారు. ఈ సినిమా కోసం నటీనటులతో సహా చిత్ర బృందం చాలా కష్టపడ్డారు. నటీనటులందరూ కలిసే వరకు కాకుండా ఎవరు దొరికితే వారిని పట్టుకొని వారి సన్నివేశాలను చిత్రీకరించారు.  ఈ సినిమాలో చాలా భాగం ఇలానే నిర్మించారు. అయితే ఈ సినిమా నామకరణం సమయంలో కూడా కాస్త చిక్కొచ్చిపడింది. ఎన్‌టీఆర్, ఏఎన్ఆర్‌లు కలిసి ఉన్న సినిమా సూర్యకాంతం పాత్ర పేరు పెడితే అభిమానులు ఊరుకుంటారా అన్ని సందేహం వచ్చింది. అంతేకాకుండా తెరపై ఈసినిమాలోని నటీనటుల పేర్లు వచ్చే సమయంలో ఎన్‌టీఆర్, ఏఎన్ఆర్ పేర్లలో ఎవరి పేరు ముందువేయాలన్న సందేహాలు రావడంతో అసలు పేర్లు వేయకుండా ఫోటోలను వేయడం జరిగింది. ఈ సినిమా ఎవ్వరూ ఊహించని విధంగా భారీ హిట్ అయింది. ఈ సినిమాలోని పాటలు కూడా అప్పట్లో ఓ ఊపుఊపేశాయి.
‘గుండమ్మ కథ’ సినిమాతో సూర్యకాంతం గారికి కూడా భారీ గుర్తింపు వచ్చింది. సినిమాలో తన సవతి కూతురిని రాచి రంపాన పెట్టే పాత్రలో సూర్యకాంతం అద్భుతంగా నటించారు. ఎంతలా అంటే ఆ సినిమా విడుదలయిన తరువాత సూర్యకాంతం ట్రైన్‌లో వెళుతుండగా అక్కడి తోటి ప్రయాణికులు సూర్యకాంతాన్ని తిట్టి పోశారు. బుల్లెమ్మ లాంటి అమాయకురాలిని వేధిస్తావా అంటూ తిట్టారు. అది సినిమా మాత్రమే అని నిజం కాదు అని ఎంత చెప్పినా అక్కడ ఎవరూ వినిపించుకోలేదు. ఈ సినిమాకు ఇప్పటికీ ప్రత్యేక అభిమానులు ఉంటారు. ఈ సినిమా వచ్చి 59 సంవత్సరాలు పూర్తయినప్పటికీ టీవీల్లో వచ్చిందంటే అందరూ ఛానల్ తిప్పకుండా చూస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: