ఈసారి సెప్టెంబర్ నెల టాలీవుడ్ బాక్సాఫీస్ కి బంగారు అక్షరాలతో నిలిచేలా మారింది. వరుసగా వచ్చిన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు వసూళ్లలోనూ మంచి జోష్ తీసుకొచ్చాయి. లిటిల్ హార్ట్స్ చిన్న సినిమాగా వచ్చినా అద్భుతమైన విజయాన్ని సాధించింది. కుటుంబ కథా నేపథ్యంతో సాగిన ఈ చిత్రం మౌత్ టాక్ బలంతో నిలదొక్కుకుంది. ఇక కిష్కింధపురి టాక్ అటూ ఇటూ ఉన్నా స్టడీగా రన్ అవుతూ ప్రొడ్యూసర్లకు నష్టమేమీ లేకుండా ముందుకు వెళ్తోంది. మరోవైపు యంగ్ హీరో తేజా సజ్జ నటించిన మిరాయ్ అయితే బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టించి వంద కోట్ల క్లబ్ లోకి చేరింది.
ఈ విజయాలన్నింటినీ మించి ఇప్పుడు అందరి దృష్టి ఒక్క సినిమా పై పడింది. అదే ‘ఓజీ’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా రిలీజ్ కి సిద్ధమవుతుండగా, అభిమానుల్లో ఊహించని స్థాయిలో ఎగ్జైట్మెంట్ కనిపిస్తోంది. రోజురోజుకీ హైప్ ఆకాశాన్నంటుతోంది.


24వ తేదీ రాత్రి 9 గంటల నుంచే ప్రీమియర్స్ మొదలవుతున్నాయి. ఇప్పటికే తెలంగాణలో టికెట్ ధర 800 రూపాయల వరకు వెళ్లిపోవడం ఈ సినిమా క్రేజ్ ఏ స్థాయిలో ఉందో చెప్ప‌క‌నే చెపుతోంది. ఏపీలో కూడా ఇలాంటిదే పరిస్థితి ఉంటుందని అంచనా. ప్రీమియర్స్ ఎన్ని థియేటర్లలో పెట్టినా అవన్నీ హౌస్‌ఫుల్ అవడం ఖాయం. సినిమా కంటెంట్ ఏమాత్రం బాగున్నా తొలి మూడు రోజుల్లోనే రికార్డు వసూళ్లు సాధించే అవకాశముంది. ట్రేడ్ సర్కిల్స్ అంచనాల ప్రకారం, ‘ఓజీ’ పవన్ కెరీర్‌లో అత్యంత పెద్ద హిట్ అవుతూ తొలి 200 కోట్ల సినిమా కావొచ్చని లెక్క‌లు క‌డుతున్నారు.


ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే అదిరిపోయే స్థాయిలో ఉన్నాయి. అక్కడ కొత్త రికార్డులు సృష్టించే అవకాశం కనబడుతోంది. నైజాంలో పవన్ క్రేజ్ కి మరీ కొలమానం లేదనడం అతిశయోక్తి కాదు. మరోవైపు, ‘ఓజీ’ రాకతో ‘మిరాయ్’ వేగం కొంత తగ్గి, లిటిల్ హార్ట్స్ కూడా సైడ్ అవ్వాల్సిందే. మొత్తంగా, విజయాలతో ప్రారంభమైన సెప్టెంబర్ ని ఘనవిజయంతో ముగించబోతున్న సినిమా ‘ఓజీ’ అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: