కరోనా థర్డ్ వేవ్ ఎదుర్కొనేందుకు భారతదేశం సన్నద్ధమవుతోంది. రాష్ట్రాల ఆరోగ్య మౌలిక సదుపాయాలు మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నడుంబిగించింది. 2-3 నెలల్లో భారత దేశ వ్యాప్తంగా 50 మాడ్యులర్ ఆసుపత్రులు ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం ఉన్న ఆస్పత్రులకు ప్రక్కనే ఈ సరికొత్త మాడ్యులర్ ఆస్పత్రులను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి ఆస్పత్రి వద్ద మౌలిక సదుపాయాలను పెంచాలనే ఉద్దేశంతో ఈ హాస్పిటల్స్ ని నిర్మించనున్నారని తెలుస్తోంది.


3 కోట్ల రూపాయలతో 100 పడకలు, ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ లతో ఒక మాడ్యులర్ ఆసుపత్రిని మూడువారాల్లో నిర్మించనున్నారు. ఈ హాస్పటల్లో చికిత్స ప్రారంభించడానికి ఆరు నుంచి ఏడు వారాల సమయం పట్టనుంది. ప్రధాన శాస్త్రీయ సలహాదారుడు కె. విజయరాఘవన్ ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. ప్రతి కరోనా రోగికి వైద్య చికిత్స అందాలని ఆయన ఆసుపత్రుల మౌలిక సదుపాయాలు పెంచేందుకు ఈ ప్రాజెక్టుని శరవేగంగా పూర్తి చేస్తున్నారు.



విద్యుత్తు, నీటి సరఫరా ఆక్సిజన్ పైప్‌లైన్ వంటి ప్రాథమిక సౌకర్యాలు కలిగి ఉన్న ఏ ప్రభుత్వ  ఆసుపత్రికి అయినా.. మాడ్యులర్ ఆసుపత్రిని జత చేస్తామని వీరు చెబుతున్నారు. రాష్ట్రాలలోని ఏ ప్రదేశాలలో ఎక్కువగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయో గుర్తించి ఆ ప్రాంతాల్లో ఈ మాడ్యులర్ ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ ఆసుపత్రులు 25 సంవత్సరాల పాటు వర్కింగ్ కండిషన్ లోనే ఉంటాయి. ఈ ఆస్పత్రుల భాగాలను వేరు చేసి, వారం రోజుల వ్యవధిలోనే మళ్లీ వేరే ప్రదేశంలో ఆస్పత్రి ఏర్పాటు చేయొచ్చు.



"మెడిక్యాబ్ హాస్పటల్స్" గా పిలవబడే మాడ్యులర్ ఆస్పత్రుల డిజైన్ ని ఐఐటీ మద్రాస్ తయారుచేసింది. అయితే ఈ ఆస్పత్రులను భారత దేశంలోని రాష్ట్రాల్లో ఏర్పాటు చేసేందుకు ఇండియన్ అమెరికన్ ఫౌండేషన్ సహకారం అందిస్తోంది. పంజాబ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఈ ఆస్పత్రులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సహాయం తీసుకుంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: