కొమ్మినేని శ్రీనివాసరావు.. తెలుగు జర్నలిజంలో సీనియర్‌గా గుర్తింపు ఉన్న జర్నలిస్టు.. గతంలో ఈనాడులో సుదీర్ఘ కాలం పనిచేసిన జర్నలిస్టు.. ఈనాడు నుంచి బయటకు వచ్చాక.. ఇతర మీడియా సంస్థల్లోనూ పని చేసిన ఆయన టీవీ5, ఎన్టీవీల్లోనూ పని చేశారు. కొన్నేళ్లుగా ఆయన సాక్షి టీవీలో ఉదయం చర్చాకార్యక్రమాలు.. సాక్షి పత్రికలో వ్యాసాలు..  ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సాక్షి మీడియాలో పని చేస్తుంటే.. జగన్‌ను పొగడటం.. టీడీపీని తిట్టడం మామూలే.


ఇందులో ఎవరినీ తప్పుబట్టాల్సిన అవసరం లేదు. తెలుగు మీడియాలో యాజమాన్య పాలసీలను కాదని పని చేసే సాహసం జర్నలిస్టులు చేసే పరిస్థితి లేదు. అలా చేస్తే ఉద్యోగం ఉండదన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఓ ఆసక్తి కరమైన పరిణామం చోటు చేసుకుంది. తరచూ టీడీపీని విమర్శించే కొమ్మినేని శ్రీనివాస్.. తాజాగా ఓ నారా లోకేశ్‌ సోషల్ మీడియా కామెంట్‌ను చమత్కారంగా ఉందని కామెంట్‌ చేశారు. టీడీపీ మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నారా లోకేష్ పెట్టిన ఓ  పోస్టు  మరీ ఘోరంగా లేదన్న కొమ్మినేని.. ఉన్నంతలో కొంత చమత్కారంగానే ఉందని వ్యాఖ్యానించారు.


నారా లోకేశ్‌  పోస్టులో  అన్నీ వాస్తవమా?కాదా అన్నది పక్కనబెడితే గతంలో మాదిరి కాకుండా, ఒక రాజకీయ నేతగా ఉన్నంతలో పద్దతిగా కామెంట్లు చేశారని కొమ్మినేని శ్రీనివాసరావు  అభిప్రాయపడ్డారు. అదేమిటబ్బా.. కొమ్మినేని నారా లోకేశ్‌ ‌పై ఇంత సదభిప్రాయం ఎందుకు వ్యక్తం చేశారా అని ఆ పోస్టు చూస్తే.. అంతా జగన్, సాక్షి తీరును ఏకేస్తూనే ఉంది. జగన్ రాష్ట్రాన్ని అంధకారాంధ్రప్రదేశ్ గా మార్చేశారన్న లోకేశ్.. ఫ్యానుకి ఓటేస్తే ఇంట్లో ఉన్న ఫ్యాన్ ఆగిపోయిందని... ఒక పక్క విద్యుత్ ఛార్జీల పెంపు పేరుతో బాదుడే బాదుడని ఆ పోస్టులో కామెంట్ చేశారు.

 

బొగ్గు కొరత ఏర్పడుతుంది జాగ్రత్త పడండని 40 రోజుల ముందే కేంద్రం హెచ్చరించినా తాడేపల్లి ప్యాలస్ లో జగన్ నిద్రపోతున్నారని లోకేశ్ కామెంట్ చేశారు. అంతే కాదు.. రూ.200 కోట్లకు పైగా సొంత మీడియాకి ప్రకటనల రూపంలో దోచిపెట్టిన మీరు.. బొగ్గు ఉత్పత్తి సంస్థలకు చెల్లించాల్సిన రూ.215 కోట్ల బకాయిలని చెల్లించకపోవడం దారుణమని కామెంట్ చేశారు. మరి అంత ఘాటుగా ఉన్నా ఈ పోస్టును కొమ్మినేని ఎందుకు విమర్శించలేదన్నది  అర్థంకాని ప్రశ్న.


మరింత సమాచారం తెలుసుకోండి: