ప్ర‌పంచీక‌ర‌ణ వేళ పెట్రోల్‌, డీజిల్ ముందుకు వ‌చ్చి.. ఇప్పుడు అవి ప్ర‌ధాన వ‌న‌రులుగా మారిపోయాయి. ఎంత‌లా అంటే నిత్యావ‌స‌ర వ‌స్తువుల్లో భాగం అయిపోయాయి. దీనికి తోడు ప్ర‌యాణానికి  ప్ర‌ధానంగా వినియోగించే ఇంధ‌నం పెట్రోల్, డీజిల్ కావ‌డం. ఇప్పుడు పెట్రోల్‌, డీజీల్ రేట్లు పెరిగిపోతూనే ఉన్నాయి. దీంతో సామాన్యుల పాలిట పెట్రో రేట్లు మంట‌గా మారుతున్నాయి. ధ‌రాఘాతాన్ని త‌ట్టుకోలేక ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.


 అస‌లే, అంతంతే గ‌డుస్తున్న సామాన్యుడి జీవితానికి రోజురోజుకు పెరిగిపోతున్న ఇంధ‌న ధ‌ర‌లు ములిగే న‌క్క‌పై తాటిపండు విధంగా మారాయి. ఆకాశమే అవ‌ధిగా పెట్రోల్, డీజీల్ ధ‌ర‌లు మండిపోతున్నాయి. ఎప్పుడో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర, లీట‌ర్ డీజీల్ ధ‌ర‌లు సెంచ‌రీ దాటిపోయాయి. ప్ర‌స్తుతం లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.110 దాటి పోయింది. అదే దారిలో డీజిల్ ధ‌ర‌కు కూడా ప‌రుగెడుతోంది.  దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు ప‌ట్టుకొమ్మ‌లుగా ఉన్న ప‌ల్లెల్లో పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల పెంపు భారం కానుంది.


 సామాన్యులు ఎక్క‌వ‌గా ఉండే ప‌ల్లెల్లో ఇంధ‌న ధ‌ర‌లు భ‌య‌పెడుతున్నాయి.  మోటార్ వాహ‌నాల బ‌దులు సైకిళ్లు, ట్రాన్స్‌పోర్ట్ వాహ‌నాలను ఉప‌యోగించుకోవాల‌ని చూస్తున్నారు. ఇంట్లో ఇచ్చే కాస్తో కూస్తో పాకెట్ మ‌నీతో ఉండే యువ‌కులు బండిని పక్క‌న పెట్టేస్తున్నారు.  పొట్ట‌కూటి కోసం ఆటో న‌డుపుకుని త‌మ కుటుంబాల‌ను పోషించుకునే ఆటో డ్రైవ‌ర‌న్న‌ల జీవ‌నం దారుణంగా మారింది. సామాన్యుడిపై ఒక వైపు పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు మంట పుట్టిస్తుంటే, మ‌రోవైపు  వంట‌గ్యాస్ బండ వంటింట్లో గుదిబండ‌గా మారింది.


ఎల్‌పీజీ గ్యాస్ ధ‌ర‌కు వెయ్యికి చేరువ‌లో ఉంది. అటు నిత్యావ‌స‌ర వ‌స్తువుల భారం ఇటు ఇంధ‌న ధ‌ర‌ల మంటలు, మ‌రో ప‌క్క గ్యాస్ ధ‌ర‌ల పెంపు సామాన్యుడిని పాతాళానికి తొక్కేస్తున్నాయి. ఇంకా రానున్న రోజుల్లో వీటి ధ‌ర‌లు మ‌రింత పెరిగే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. అంత‌ర్జాతీయంగా పెరుగుతున్న ముడి చ‌మురు ధ‌ర‌ల‌తో పాటు దేశియంగా త‌గ్గించ‌ని ప‌న్నుల‌తో  ప్ర‌జ‌లు ఇబ్బంది ప‌డుతున్నారు. ఇది ఇలానే కొన‌సాగుతే.. రాబోయే రోజుల్లో దేశ ఆర్థిక వ్య‌వ‌స్త‌పై తీవ్ర ప్ర‌భావం చూపే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: